Begin typing your search above and press return to search.

బాబూ ప్రమాణం చేద్దామా... బాలయ్య లోకేష్ మ్యాటరేంటి...?

By:  Tupaki Desk   |   19 Aug 2022 3:30 PM GMT
బాబూ ప్రమాణం చేద్దామా... బాలయ్య లోకేష్ మ్యాటరేంటి...?
X
చంద్రబాబును ప్రమాణానికి పిలిచి సవాల్ చేశారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. నా మీద టీడీపీ నేతలు ఫేక్ వీడియో రిలీజ్ చేసి దాన్ని నమ్మించేందుకు అమెరికాలోని తప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు. అయితే ఆ సర్టిఫికేట్ తప్పు అని తాము అలా ఇవ్వలేదని ఎక్లిప్స్ ల్యాబ్ నుంచి ఆ సంస్థకి చెందిన జిమ్ స్టాఫర్డ్ స్పష్టం చేశారని గోరంట్ల మాధవ్ చెప్పారు.

ఈ నేపధ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ చేశారు. నా పేరిట ఫేక్ వీడియో సృష్టించి దాన్ని దేశమంతా తిప్పి నానా అవస్థలు పడుతున్న బాబుకు షార్ట్ కట్ మెదడ్ ఒకటి చెబుతాను అని గోరంట్ల పేర్కొన్నారు. నీవు నమ్మిన వెంకటేశ్వరస్వామి సాక్షిగా కాణీపాకంలో వినాయకస్వామి ఎదుట ఓటుకు నోటు కేసులో ఆడియో తనది కాదని చెప్పగలవా బాబూ అని గోరంట్ల సవాల్ చేశారు. నాడు దొరికిన యాభై లక్షల సొమ్ము తనది కాదని కూడా బాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.

తాను మాత్రం న్యూడ్ వీడియో తనది కాదని కాణీపాకంలో ప్రమాణం చేసి మరీ చెప్పగలను అని ఆయన అన్నారు. చంద్రబాబు తన సవాల్ కి రెడీ అంటే ఈ క్షణమే తాను కాణీపాకంలో ఉంటాను అని గోరంట్ల చెప్పారు. ఇక చంద్రబాబుది ఆయన అనుకూల మీడియాది కుల దురంకారం అని ఆయన అన్నారు. కేవలం బీసీని అయినందువల్లనే తనను ముప్పతిప్పలు పెట్టాలని చూస్తున్నారు అని అన్నారు. ఇదే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికితే మీడియాలో చర్చకు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.

అమ్మాయి కనబడితే ముద్దు అయినా పెట్టాలి కడుపు అయినా చేయాలి అన్న బాలయ్య అసభ్య కామెంట్స్ మీద ఏనాడైనా బాబు అనుకూల మీడియా చర్చకు పెట్టిందా అని ఆయన నిలదీశారు. లోకేష్ బాబు అమ్మాయిలతో ఫోటోలలో కనిపిస్తే దాని మీద డిబేట్ చేశారా అని ఆయన రెట్టించారు. ఇదంతా బీసీల మీద దాడి అని అన్నారు. తెలుగుదేశంలోని బీసీలు కూడా ఈ సంగతి తెలుసుకోవాలని ఆయన కోరారు. ఒక బీసీ ఎంపీని బదనాం చేయడానికి కూడా బీసీలనే బాబు ఉపయోగిస్తున్నారు అంటే కుల వివక్ష ఏంటో అర్ధం చేసుకోవాలని గోరంట్ల అన్నారు.

ఇదిలా ఉంటే తాను మొదటి నుంచి ఫేక్ వీడియో అని చెబుతున్నాను అని అది ఇపుడు రుజువు అయిందని ఆయన అన్నారు. చంద్రబాబు ముమ్మారు సీఎం గా పనిచేశారని, నాలుగవ సారి అధికారంలోకి వచ్చేందుకు తనను పావుగా వాడుకోవాలని చూడడం దారుణం అని గోరంట్ల అన్నారు. బాబు తనది ఒరిజినల్ వీడియో అని ప్రమాణం చేస్తే తాను ఆయన ముఖాన్నే రాజీనామా ఇచ్చేసి మాజీ ఎంపీ అయిపోతాను అని అన్నారు. ఇక తన మీద అన్ని రకాలుగా దుష్ప్రచారం చేస్తున్న వారి మీద చట్టపరమైన న్యాయపరమైన చర్యలను కోరుతూ పోలీసులను ఆశ్రయించానని మాధవ్ చెప్పారు మొతానికి గోరంట్ల మాధవ్ పేరిట న్యూడ్ వీడియో కాదు కానీ బాబును బాలయ్యను, లోకేష్ ని కూడా బయటకు లాగేశారు అంటున్నారు.