Begin typing your search above and press return to search.

వరంగల్ కోర్టు సంచలన తీర్పు .. గొర్రెకుంట 9 హత్యల కేసు నిందితుడికి ఉరి ఖరారు !

By:  Tupaki Desk   |   28 Oct 2020 2:50 PM GMT
వరంగల్ కోర్టు సంచలన తీర్పు .. గొర్రెకుంట 9 హత్యల కేసు నిందితుడికి ఉరి ఖరారు !
X
తెలంగాణ లో సంచలనం సృష్టించిన వరంగల్ , గొర్రెకుంట తొమ్మిది హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌కు ఉరి శిక్ష వేస్తూ సంచలన తీర్పును ఇచ్చింది కోర్టు, హత్యలు చేసినట్టు జడ్జి ముందు నిందితుడు సంజయ్‌ ఒప్పుకోవడంతో నేరం రుజువు అయినట్లు జిల్లా కోర్టు ప్రకటించింది. మే 21న గొర్రెకుంటలో 9 మందికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయిన అనంతరం సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు నిందితుడు. ఈ ఘటనలో నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే కేవలం 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 57మంది మంది వాంగ్మూలం నమోదు చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి అతి తక్కువ సమయంలోనే కోర్టు ఉరిశిక్ష విధించడంపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇక ఈ కేసులో నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా కష్టకాలంలో వలస కార్మికుల ఆకలితో అలమటిస్తున్న వేళ. గోనె సంచులు కుట్టే కర్మాగారంలో కొంతమంది బిహార్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు కనిపించకుండా పోయారు. దాని ఓనర్ సంతోష్ పిర్యాదుతో గీసుగొండ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకటం ప్రారంభించారు. అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టి .. గోనె సంచుల గోడౌన్‌ కు ప్రక్కన గల పాడుబడ్డ బావిలో మొత్తం తొమ్మిది శవాలని గుర్తించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ హత్యలను కాల్‌ డేటా రికార్డింగ్‌ ఆధారంగానే పోలీసులు కేసును ఛేదించారు. వరంగల్ నగర శివారులో గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్‌, అతడి భార్య పనిచేసేవారు. ఈ క్రమంలోనే బిహార్‌కు చెందిన సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫీకా తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజీవ్‌ దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే, తన కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్‌ ను మందలించింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్‌ యాదవ్‌ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్‌ రథ్‌ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లలో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో రైల్లోంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే, తన అక్క కూతురు గురించి మక్సూద్‌ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్‌ కుటుంబాన్ని కూడా హతమార్చాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు.

ఇదే క్రమంలో మే 16 నుంచి 20వ తేదీ వరకు రోజూ వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రానికి నిత్యం వచ్చేవాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. మే 20వ తేదీన మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్‌ చౌరస్తాలో ఓ మెడికల్‌ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు.

అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న ఆ తొమ్మిది మందిని పాడుబడ్డ బావిలో పడేశాడు. ఈకేసును సవాల్ గా స్వీకరంచిన అప్పటి వరంగల్ పోలీసు కమిషనర్ రవీంద్రనాథ్ మొత్తం ఈ కేసు ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోంచి వెళ్లడం దగ్గర నుంచి మళ్లీ చేరుకునే వరకు అందులో నమోదయ్యాయి. దీంతో నిందితుడిని జాన్‌పాక్‌లోని తన ఇంటిలో అదుపులోకి తీసుకున్నామని అని రవీందర్‌ వెల్లడించారు. చివరికి సంజయ్ కుమార్ కు ఉరిశిక్ష పడటం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.