Begin typing your search above and press return to search.

కాస్తైనా బ్లాక్ మ‌నీ తెస్తున్నారా? మోడీజీ

By:  Tupaki Desk   |   25 Jan 2018 10:38 AM GMT
కాస్తైనా బ్లాక్ మ‌నీ తెస్తున్నారా? మోడీజీ
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రాహుల్ గాంధీ మాట తీరులో నిజంగానే వాడీ వేడీ క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌రిగ్గా మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన రాహుల్ గాంధీ... ఆ ఎన్నిక‌ల్లో త‌నదైన శైలి కొత్త రూపాన్ని - కొత్త పోరును చ‌వి చూపించారు. కొద్దిలో మిస్ అయ్యింది గానీ... మ‌రింత‌గా రాహుల్ క‌ష్ట‌ప‌డి ఉంటే గుజ‌రాత్‌ లో బీజేపీ పుట్టి మునిగేదేన‌న్న విశ్లేష‌ణ‌లు లేక‌పోలేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే కాకుండా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ప్ర‌ధానమంత్రి అభ్య‌ర్థిగా - పార్టీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టికంటే కూడా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతే రాహుల్ బాగా రాణిస్తున్నార‌ని అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు ఒప్పేసుకున్నారు. మ‌రి ఈ త‌ర‌హా భావ‌న‌కు సీనియ‌ర్లు రావ‌డానికి రాహుల్ ఏదో ఒక‌టి చేసి ఉండాలి క‌దా. అదే గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టించిన వైనం. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక్క సారిగా స‌త్తా చాటిన రాహుల్‌... ఇక ఎంత‌మాత్రం తాను స‌త్తా లేని నేత‌న‌న్న విష‌యాన్ని ఒప్పుకునేందుక సిద్ధంగా లేన‌ని తేల్చి పారేశారు.

గుజ‌రాత్ ఎన్నిక‌లు మ‌గిశాయి... ఇప్పుడు దక్షిణాదిన కీల‌క రాష్ట్రంగా ప‌రిగ‌ణిస్తున్న క‌ర్ణాట‌క‌తో పాటు మ‌రో ఆరు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో ఓ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కాగా... క‌ర్ణాట‌క స‌హా మ‌రో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కావాల్సి ఉంది. ఆ ఎన్నికలు కూడా ముగిస్తే... ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లే త‌రువాయి. అంటే మొత్తంగా ఇప్ప‌టి నుంచే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైపోవాల్సిందేన‌న్న మాట‌. ఈ నేప‌థ్యంలో ఆయా సంద‌ర్భాల‌కు అనుగుణంగా స్పందిస్తున్న రాహుల్ గాంధీ... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటుగా బీజేపీ నేత‌ల‌ను - ఎన్డీయే మిత్ర ప‌క్షాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని సంధిస్తున్న వ‌రుస సెటైర్లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొన్న దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన రాహుల్‌.... దేశంలో 75 శాతానికి పైగా సంప‌ద ఒక్క శాతం మంది సంప‌న్నుల వ‌ద్దే ఉంద‌న్న విష‌యాన్ని కూడా వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో చెప్పి రండ‌ని ఓ చుర‌క అంటించేశారు. తాజాగా దావోస్‌ లో ఆ స‌ద‌స్సును ముగించుకుని తిరిగి వ‌చ్చిన మోదీని ఉద్దేశించి.... మ‌రో సెటైర్‌ ను రాహుల్ వ‌దిలారు.

గ‌డ‌చిన ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా తాము అధికారంలోకి వ‌స్తే... స్విస్ బ్యాంకుల్లో భారత్‌ కు చెందిన న‌ల్ల కుబేరులు దాచిన బ్లాక్ మ‌నీని తిరిగి దేశానికి తీసుకువ‌స్తామ‌ని మోదీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే అంశాన్ని మ‌రోమారు ప్ర‌స్తావించిన రాహుల్‌... *దావోస్ నుంచి వ‌స్తున్నారు క‌దా.. ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన మాదిరిగా బ్లాక్ మ‌నీలో కొంతైనా తీసుకువ‌స్తున్నారా?* అంటూ త‌న‌దైన రీతిలో సెటైర్ సంధించారు. దావోస్ అంటే స్విట్జ‌ర్లాండ్‌ లో ఉన్న న‌గ‌ర‌మే క‌దా. ఈ విష‌యాన్ని, మోదీ గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌ను మిక్స్ చేసేసిన రాహుల్‌... స్విట్జర్లాండ్‌ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - భారత్ కు తిరిగి వస్తూ విమానంలో కొంతైనా నల్లధనాన్ని తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. *మీరు స్విట్జర్లాండ్‌ నుంచి నల్లధనం తెస్తారని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నా*రని కూడా రాహుల్ గాంధీ వ్యంగ్య‌మాడారు. దేశసంపదలో 73 శాతం సంపద... జనాభాలో ఒక్క శాతం ఉన్న ధనికుల వద్దే ఎందుకు పోగుపడిందనే దానిపై ప్రధాని ప్రజలకు వివరణ ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్ చేశారు.