Begin typing your search above and press return to search.

చంద్రబాబు కోర్టులో ఏం తేలబోతోంది

By:  Tupaki Desk   |   20 May 2017 6:51 AM GMT
చంద్రబాబు కోర్టులో ఏం తేలబోతోంది
X
ఫిరాయింపు ఎమ్మెల్యేల దెబ్బకు చాలా నియోజకవర్గాల్లో గొడవలు జరిగాయి. కానీ, చంద్రబాబు ఏదో రకంగా సర్దిచెప్పి బయటపడకుండా మెంటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ, ప్రకాశం జిల్లాలో మాత్రం చంద్రబాబు మాటలు పనిచేయడం లేదు. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవిల మధ్య యుద్ధాన్ని చంద్రబాబు ఆపలేకపోతున్నారు. తాజాగా హత్యలు మొదలవడంతో ఇదెక్కడికి దారి తీస్తుందో అని చంద్రబాబు టెన్షన్ పడుతున్నారట. బలరాంకు సర్దిచెప్పలేక.. గొట్టిపాటిని మందలించలేక చివరికి ఏం చేయాలో అర్థం కాక... ఇక్కడి సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక చంద్రబాబు తల పట్టుకుంటున్నారట.

మరోవైపు తాజా ఉద్రిక్తతలను మరింత పెంచేలా బలరాం, ఆయన కుమారుడు ఓ వైపు... గొట్టిపాటి రవి మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గొట్టిపాటి రవిపై ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొట్టిపాటి ఓ క్రిమినల్ అని... నిజం చెప్పే అలవాటు ఆయనకు లేదని విమర్శించారు. 'సొంత అన్నపైనే పోటీ చేసిన సన్నాసి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సిద్ధాంతాలు లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఆయనలా కక్కుర్తి పనులు చేయడం, ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేసి పబ్బం గడుపుకునే తత్వం తనది కాదని అన్నారు. ఉన్నతాధికారుల సహాయంతో నియోజకవర్గానికి మేలు చేయడం మాత్రమే తనకు తెలుసని... గొట్టిపాటిలా నీచమైన రాజకీయాలు చేయడం తనకు తెలియదని చెప్పారు. గొట్టిపాటి బతుకే అబద్ధాల బతుకని ఎద్దేవా చేశారు. అన్నపైనే పోటీ చేసి సొంత కుటుంబంలోనే చిచ్చు పెట్టాడని... తల్లికి-కుమారుడికి, నాయనమ్మకు- మనవడికి, బాబాయ్ కి- కొడుకుకి మధ్య తగాదాలు వచ్చేలా చేసిన నీచుడు గొట్టిపాటి అని ధ్వజమెత్తారు.

బలరాం కుమారుడు వెంకటేశ్ కూడా రవిపై మండిపడ్డారు. చంద్రబాబుకు మాట రాకూడదనే ఆగాం కానీ, చేతులు ముడుచుకు కూర్చోలేదని అంటూ కాలు దువ్వారు.

కాగా బలరాం వ్యాఖ్యలను గొట్టిపాటి ఖండించారు. హత్యారాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తనకు గాని, తన కుటుంబానికి కాని ఎప్పుడూ లేదని అన్నారు. గ్రామంలో జరిగిన ఘటనతో తాము కూడా చాలా బాధగా ఉన్నామని... కొత్తగా టీడీపీలోకి వచ్చిన తాము అందరినీ కలుపుకుని పోయే ప్రక్రియలో ఉన్నామని అంటున్నారు. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడులను తీసుకొచ్చి తమ మీద రుద్దడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాము మర్డర్లు చేస్తామా? లేదా? అనే విషయం అందరికి తెలిసిందేనని... తమపై అనవసరంగా నిందలు వేయడం తగదని ఎత్తపొడిచారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న తాను ఇలాంటి హత్యారాజకీయాలను ఎప్పుడైనా చేశానేమో ఎవర్నైనా అడిగి తెలుసుకోండని అన్నారు. తాము హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని... జరిగిన విషయం మొత్తాన్ని ఆయన దృష్టికి తీసుకెళతానని తెలిపారు.

కాగా రెండు వర్గాలూ చంద్రబాబును కలవడానికి రెడీ అవుతుండడంతో అధినేత కోర్టులో ఏం తేలుతుందా అన్న ఆసక్తి అంతటా నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/