Begin typing your search above and press return to search.

బిగ్ షాట్ కి వైసీపీ భారీ ఆఫర్... ?

By:  Tupaki Desk   |   31 Jan 2022 2:30 AM GMT
బిగ్ షాట్ కి వైసీపీ భారీ ఆఫర్... ?
X
రాజకీయాల్లో చాలా చిత్రాలు జరుగుతూంటాయి. పెద్ద పదవులు కొందరిని అలా వెతుక్కుంటూ వస్తాయి. అవసరాలు, స్నేహాలు, ఇతర వ్యవహారాలే టోటల్ గా సమీకరణలను అన్నీ కూడా మార్చేస్తాయి. ఇదిలా ఉంటే వైసీపీలో రాజ్యసభ‌ టికెట్ల మీద చర్చ కాస్తా జోరుగానే సాగుతోంది. వైసీపీకి నాలుగు పోస్టులు వస్తాయి. అందులో నుంచి ఎవరికి చాన్స్ ఇస్తారు అన్నదే ఇపుడు వేడి వేడిగా సాగుతున్న డిస్కషన్.

వైసీపీ తరఫున ఈసారి కూడా సామాజిక, రాజకీయ సమీకరణలను జగన్ బేరీజు వేసుకునే అభ్యర్ధులను ఎంపిక చేస్తారు అని అంటున్నారు. జూన్ లో ఏపీ నుంచి నలుగురు ఎంపీలు రిటైర్ అవుతున్నారు. ఇందులో బీజేపీ నుంచి ముగ్గురు ఉంటే వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు.

ఇక విజయసాయిరెడ్డి తాను విశాఖ లోక్ సభ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతున్నా ఆయననే ఢిల్లీలో నమ్ముకున్న వైసీపీ మరోసారి రాజ్యసభకు పంపుతుంది అని అంటున్నారు. ఆ విధంగా విజయసాయిరెడ్డి రెన్యువల్ అన్నది కచ్చితమని చెబుతున్నారు. ఇక మిగిలిన మూడింటి విషయంలో ఆసక్తికరమైన చర్చ ఉందిపుడు. బీసీలకు ప్రతీసారి పెద్ద పీట వెస్తూ వస్తున్న జగన్ గతసారి నాలుగు సీట్లు ఖాళీ అయితే అందులో ఇద్దరు బీసీ నేతలను రాజ్యసభకు పంపారు.

ఇపుడు కూడా ఒక బీసీకి చాన్స్ ఉందని అంటున్నారు. ఆయన ఎవరో కాదు, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీలో చాలా కాలం ఉండి ఆ మధ్య వైసీపీలోకి వచ్చిన నేత బీద మస్తాన్ రావు. బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన బీదకు రాజ్యసభ టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. నెల్లూరు జిల్లాల్లో బీసీలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పడంతో పాటు పార్టీలో చేరిన వారికి గుర్తింపు అన్నది కూడా చూపించాలన్న ఉద్దేశ్యంతోనే బీదకు పదవి అంటున్నారు.

మిగిలిన రెండింటిలో ఒకటి కమ్మ కానీ కాపులకు కానీ కేటాయిస్తారని టాక్. అదే విధంగా ఎస్సీలకు కూడా చాన్స్ ఉండవచ్చు అని చెబుతున్నారు. ఇక నాలుగవ ఎంపీ టికెట్ ని దేశంలో బిగ్ షాట్ గా ఉన్న గౌతమ్ ఆదానీకి ఇస్తారని తెలుస్తోంది. ఆయన ఈ మధ్యనే ఏపీలో పలు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని కలిసినట్లుగా చెబుతున్నారు. ఆయనతో మంచి అనుబంధం కూడా వైసీపీ అధినాయకత్వానికి ఉందని అంటున్నారు.

గతసారి కూడా దేశంలో నంబర్ వన్ బిగ్ షాట్ అయిన ముఖేష్ అంబానీ రికమండేషన్ మీద గుజరాత్ కి చెందిన పరిమళ నత్వానీకి టికెట్ ఇచ్చారని చెబుతున్నారు. ఈసారి గౌతమ్ ఆదానీ ఆ ప్లేస్ లోకి వస్తున్నారని తెలుస్తోంది. ఆదానీ ద్వారా ఏపీలో పలు ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టించాలని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామిని చేయాలని ప్రభుత్వ పెద్దలకు ఆలోచనలు ఉన్నాయట.

ఇక ఢిల్లీలో కూడా మంచి పలుకుబడి ఉన్న ఆయన్ని తమ ఎంపీగా చేసుకుంటే ఉభయకుశలోపరిగా ఉంటుంది అని భావించే ఈ విధంగా భారీ ఆఫర్ ప్రకటించారు అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే నాలుగు రాజ్యసభ ఎంపీ ఆభ్యర్ధుల మీద అధినాయకత్వానికి పక్కా క్లారిటీ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమైనా మార్పుచేర్పులు ఉంటాయేమో.