Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు న‌చ్చిన‌ట్లు చేస్తున్న‌గ‌వ‌ర్న‌ర్‌!

By:  Tupaki Desk   |   7 April 2022 6:01 AM GMT
కేసీఆర్‌కు న‌చ్చిన‌ట్లు చేస్తున్న‌గ‌వ‌ర్న‌ర్‌!
X
తెలంగాణ‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌, రాజ్‌భ‌వ‌న్ మ‌ధ్య దూరం పెరిగింది.. కేసీఆర్ వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. అలాంటిది.. కేసీఆర్‌కు న‌చ్చిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డ‌మేంటీ? అనుకుంటున్నారు. అవును.. ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై దూకుడు పెంచితే త‌న‌కే క‌లిసి వ‌స్తుంద‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ను క‌లిసిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ కేసీఆర్ ప్ర‌భుత్వంపై మ‌రింత జోరు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అది కేసీఆర్‌కే లాభం చేకూరుస్తుంద‌ని అంటున్నారు. కేసీఆర్‌ఖు కావాల్సింది కూడా అదే అనే మాట‌లు వినిపిస్తున్నాయి.

అందుకే సాగ‌దీస్తున్నారు..
గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి చేప‌ట్టిన మొద‌ట్లో త‌మిళ‌సైకి కేసీఆర్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌త్సంబంధాలే సాగాయి. కానీ ఒక్క‌సారి ఆమె గ‌వ‌ర్న‌ర్ కోటాలో కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ప్ర‌తిపాద‌న‌ను నిరాక‌రించ‌డంతో దూరానికి బీజం ప‌డింది. మ‌రోవైపు తెలంగాణ‌లో బీజేపీని క‌ట్ట‌డి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ కూడా.. గ‌వ‌ర్న‌ర్‌తో దూరం కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. రిప‌బ్లిక్ డే, ఉగాది వేడుక‌ల‌కు సీఎంతో స‌హా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్ల‌లేదు.

మేడారం జాత‌ర ముగింపు కార్య‌క్ర‌మం, యాదాద్రి ఆల‌య సంద‌ర్శ‌నానికి గ‌వ‌ర్న‌ర్ వ‌స్తే అధికారులు ప్రోటోకాల్ పాటించ‌క‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తి రేపుతోంది. మోడీ, అమిత్ షాకు రాష్ట్రంలోని ప‌రిస్థితులు, కేసీఆర్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలి త‌దిత‌ర విష‌యాల గురించి ఆమె వివ‌రించ‌రానే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వాళ్ల సూచ‌న‌ల‌తో రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ ఏం చేయాబోతున్నారో అనే ఆసక్తి క‌లుగుతోంది.

ఆ సూచ‌న‌తోనే..
మ‌రోవైపు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సూచ‌న‌ల‌తోనే గ‌వ‌ర్నర్ విష‌యంలో త‌గ్గేదేలే అన్న‌ట్లు కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌మాచారం. గ‌తేడాది పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇలాగే అక్క‌డ మ‌మ‌త వ‌ర్సెగ్ గ‌వ‌ర్న‌ర్ పోరు సాగింది. ప్ర‌భుత్వంపై బీజేపీ గ‌వ‌ర్న‌ర్ పెత్త‌నం చేస్తున్నారంటూ మ‌మ‌త ఆ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ పెత్త‌నాన్ని జ‌నాల‌కు వివ‌రించింది. దీంతో మ‌మ‌త ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి వ్య‌క్త‌మైంది.

మూడోసారి ఆమె ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవ‌డంలో అది కీల‌క పాత్ర పోషించింది. ఇప్పుడు తెలంగాణ‌లోనూ హ్యాటిక్ కొట్టాల‌ని చూస్తున్న కేసీఆర్ కూడా మ‌మ‌త బాట‌లోనే సాగుతున్న‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పీకే సూచ‌న‌ల‌తోనే గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో కేసీఆర్ ఇలా దూరం పాటిస్తున్నార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే అప్పుడు బీజేపీని టార్గెట్ చేసి ప్ర‌జ‌ల ఓట్లు గెలుచుకోవ‌చ్చ‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోందని విశ్లేష‌కులు చెబుతున్నారు. అందుకే గ‌వ‌ర్న‌ర్ రెచ్చిపోతే అది కేసీఆర్‌కే మేల‌ని అంటున్నారు.