Begin typing your search above and press return to search.

గవర్నర్ పైనే నిఘానా? అసలేంటి గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ వివాదం?

By:  Tupaki Desk   |   10 Nov 2022 4:32 AM GMT
గవర్నర్ పైనే నిఘానా? అసలేంటి గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ వివాదం?
X
తెలంగాణలో ఎవ్వరిపైనైనా నిఘా వేసే అధికారం పోలీసులకు వరంగా మారింది. అదే కేసీఆర్ కు బలం అవుతోంది. ప్రత్యర్థులకు శాపం అవుతోంది. ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా మారింది ఈ ఫోన్ ట్యాపింగ్ నే. అంతకుముందు చంద్రబాబు ను ఓటుకు నోటు లో బుక్ చేసింది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ నే. తెలంగాణ ప్రభుత్వం అనైతికంగా వేసే ఈ నిఘాపై ఎన్నో ఆరోపణలు, కేసులు ఉన్నా కూడా మారడం లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈసారి ఆరోపణలు చేసింది మామూలు వ్యక్తి కాదు.. ఏకంగా తెలంగాణ గవర్నర్.

తెలంగాణ గవర్నర్ తమిళిసై తాజాగా చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. తాజాగా రాజ్ భవన్ లోనే ప్రెస్ మీట్ పెట్టిన ఆమె సంచలన కామెంట్స్ చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్న ఆమె.. ఫామ్ హౌస్ ఇష్యూలోనూ తనను ఇరికించాలని చూశారని సంచలన కామెంట్స్ చేశారు.

ఫాంహౌస్ కొనుగోళ్లలో ఆరోపణలు వచ్చిన తుషార్ గతంలో రాజ్ భవన్ లో ఏడీసీగా పనిచేశారని.. తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని విమర్శించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు అనుమానంగా ఉందని గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని.. ఆ బిల్లులు సమగ్రంగా పరిశీలిస్తున్నానని.. ఆలోపే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

గవర్నర్ వర్సెస్ కేసీఆర్ సర్కార్ వివాదం ఇప్పటిది కాదు.. బీజేపీ తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా నామినేట్ చేసినప్పటి నుంచే నడుస్తోంది. కేసీఆర్ సర్కార్ చేసే బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు. ఎమ్మెల్సీలు, ఇతరులను నామినేట్ చేసినా వెనక్కి పంపుతున్నారు. ఓ రకంగా గవర్నర్ తో తెలంగాణ సర్కార్ ను బీజేపీ చెడుగుడు ఆడేస్తోంది. అందుకే కేసీఆర్ సర్కార్ కూడా ఆమెకు తెలంగాణలో అసలు ప్రొటోకాల్ ఇవ్వకుండా సతాయిస్తోంది. తాజాగా ఆమె ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేస్తున్నారని తమిళిసై ఆరోపిస్తోంది.

రాష్ట్రంలో జరిగే రాజకీయ వ్యవహారాలు..తమ శత్రువులు చేసే పనులన్నింటిపై నిఘా వేస్తున్నారని కేసీఆర్ సర్కార్ పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఓటుకు నోటు, ఫాంహౌస్ కొనుగోళ్లలో ఆ విషయం రుజువైంది.

ఇప్పుడు గవర్నర్ ఆరోపణలకు బలం చేకూరినట్టు అవుతోంది. అసలు ట్యాపింగ్ జరుగుతోందా? లేదా? అన్నది అధికారికంగా తెలియదు. గవర్నర్ ఆరోపణలపై కేసీఆర్ సర్కార్ స్పందించలేదు. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.