Begin typing your search above and press return to search.

ఏపీ స్కూళ్ల స్వ‌రూపం ఛేంజ్‌.. ఎలా అంటే..!

By:  Tupaki Desk   |   26 Oct 2021 8:38 AM GMT
ఏపీ స్కూళ్ల స్వ‌రూపం ఛేంజ్‌.. ఎలా అంటే..!
X
ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా వేలాది కోట్ల‌ను వెచ్చించి.. ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను అధునాత‌న హంగుల‌తో తీర్చిదిద్దుతోంది. దీంతో ఒక‌ప్పుడు.. ప్ర‌భుత్వ స్కూళ్లు.. అంటే.. కేవ‌లం టైంపాస్ అనుకునే ప్ర‌జ‌లు.. ఇప్పుడు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడూ... ఈగ‌లు తోలుకునే స్కూళ్ల‌లో ఇప్పుడు విద్యార్థులు కిక్కిరిసిపోతున్నారు. దీనికి ప్ర‌భుత్వం నుంచి అన్ని రూపాల్లోనూ అందుతున్న స‌హ‌కారం కావొచ్చు..అమ్మ వొడి వంటి ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాలు కావొచ్చు.

మార‌నున్న సిల‌బ‌స్‌

ఇక‌, ఇప్పుడు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన నూత‌న జాతీయ విద్యావిధానాన్ని సంపూర్ణంగా అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. దీనిలో భాగంగా వ‌చ్చే నెలలో 3 నుంచి 5 త‌ర‌గ‌తుల‌ను హైస్కూల్లో విలీనం చేయ‌నుంది. స‌ర్కారీ స్కూల్స్‌ లో నాణ్యమైన విద్య అందించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. నూత‌న విద్యావిధానం ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ త‌ర‌గ‌తులుగా పాఠ్యప్రణాళిక ఉంటుంది. ఇప్పటి వ‌ర‌కూ ఉన్న ప్రైమ‌రీ, అప్పర్ ప్రైమ‌రీ, హై స్కూల్ విధానానికి బ‌దులు కొత్త విధానం అమ‌ల్లోకి వ‌స్తుంది. ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో కూడా న‌ర్సరీతో పాటు ఎల్‌కేజీ, యుకేజీ, మొద‌టి, రెండో త‌ర‌గ‌తుల‌ను ఫౌండేష‌న్ త‌ర‌గతులుగా విభ‌జించ‌నున్నారు.

8వ త‌ర‌గ‌తి పాస్ కావాల్సిందే!

విద్యార్థి మూడో ఏట పాఠ‌శాల‌లో చేరితే ప్రైవేటు స్కూల్స్‌ కు ధీటుగా ఉండేలా ఫౌండేష‌న్ త‌ర‌గ‌తులు ఉండ‌నున్నాయి. ఇక ఈ ఐదు త‌ర‌గ‌తుల‌కు క‌లిపి ఒక పాఠ‌శాల ఉంటుంది. ఇప్పటి వ‌ర‌కు ప్రైమ‌రీ పాఠ‌శాల‌లో ఉన్న మూడు, నాలుగు, ఐదు త‌ర‌గ‌తుల‌ను హై స్కూల్‌లో విలీనం చేస్తారు. ఇక్కడ గ‌తంలో మాదిరిగానే ఎస్జీటీ ఉపాధ్యాయుల‌తో టీచింగ్ చేయించాలని నిర్ణయించారు. మూడు నుంచి ఐదు, ఆ తర్వాత ఆరు నుంచి ఎనిమిది, ఇక ఆ మీదట ప్లస్ టు.. ఇలా నాలుగు విభాగాలుగా విభ‌జించారు. కొత్త విద్యావిధానంలో ఇక‌ పై ఎనిమిదో త‌ర‌గ‌తి ఫైన‌ల్ పరీక్షల్లో కూడా విద్యార్ధులు త‌ప్పనిస‌రిగా పాస్ కావ‌ల్సి ఉంటుంది.

ఇక‌, సీబీఎస్ సీ సిల‌బ‌స్‌

ఓవైపు జాతీయ విద్యావిధానం అమ‌ల్లోకి తీసుకురావ‌డంతో పాటు వీలైనంత త్వర‌గా సీబీఎస్ఈ సిల‌బ‌స్‌ను కూడా ప్రవేశ‌పెట్టేలా స‌ర్కార్ అడుగులు వేస్తోంది. కొత్త విద్యావిధానాన్ని స్వాగతిస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు దీని పై మ‌రింత అధ్యయనం అవసరమని అంటున్నారు. అదే సమయంలో టీచ‌ర్ పోస్టుల్లో కోత పెట్టకుండా నాణ్యమైన విద్య అందేలా చ‌ర్యలు తీసుకోవాలంటు న్నాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. నూత‌న జాతీయ విద్యావిధానం అమ‌లుతో మ‌రింతగా విద్యావ్య‌వస్థ‌ను మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.