Begin typing your search above and press return to search.

పెళ్లికి దేశాధ్యక్షుడు ఓకే చెప్పాలా?

By:  Tupaki Desk   |   11 Sept 2015 10:13 AM IST
పెళ్లికి దేశాధ్యక్షుడు ఓకే చెప్పాలా?
X
కొన్ని నిర్ణయాల విషయంలో కొన్ని ప్రభుత్వాలు అనుసరించే ధోరణి చూస్తే.. మనం ఏ కాలంలో బతుకుతున్నామా? అనిపించక మానదు. ప్రేమకు ఎల్లలు లేవన్నది జమానాలోనే ఓకే చెప్పేసిన మాట. డిజిటల్ యుగంలో రాతి యుగంలోనూ లేని నిబంధనను తీసుకొచ్చే ప్రయత్నం చేయటం బంగ్లాదేశ్ ప్రభుత్వానికే చెల్లింది.

చరిత్రలో ప్రేమకు అడ్డుపడినోళ్లు ఎంతో మంది ఉన్నారే కానీ.. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలనే అంశంతో పాటు.. ఫలానా వారిని పెళ్లి చేసుకోవాలంటే దేశాధ్యక్షుడి అనుమతి తీసుకోవాలన్న చిత్రమైన నిబంధనను తీసుకురావాలన్న ఆలోచనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మనసుకు నచ్చినోడిని పెళ్లి చేసుకోవటానికి కులం.. మతం.. జాతీయత ఏవీ అడ్డురావు. కానీ.. బంగ్లాదేశ్ ప్రభుత్వం తెస్తున్న చట్టం అధికారికం అయితే.. మాత్రం ప్రేమించే విషయంలోనూ.. పెళ్లి చేసుకునే విషయంలోనూ చాలా ముందుచూపుతో వ్యవహరించాలే తప్పించి మనసు మాటను పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి.

ఎందుకంటే.. బంగ్లాదేశీయులు ఎవరైనా సరే.. తమకు నచ్చిన విదేశీయుడ్ని పెళ్లి చేసుకునే అవకాశాన్ని పరిమితం చేస్తూ.. చట్టం ఒకటి తీసుకురానున్నారు. దీని ప్రకారం విదేశీయుడు ఎవరైనా బంగ్లాదేశీయుల్నిపెళ్లి చేసుకోవాలనుకున్నా.. బంగ్లాదేశీయులు ఎవరైనా విదేశీయుడ్ని పెళ్లి చేసుకోవాలని భావించినా.. అంతిమంగా.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సిత్రమైన రూల్ ని తీసురావాలన్న ఆలోచనలో ఉందట. ప్రేమకు.. పెళ్లికి సరికొత్త ఆంక్షల్ని విధించిన దేశంగా బంగ్లాదేశ్ నిలిచిపోవటం ఖాయం. పాపం.. బంగ్లాదేశీయులు.