Begin typing your search above and press return to search.

ఇంకేముంది.. బంగారం ధర కొండకెక్కటమేనా?

By:  Tupaki Desk   |   17 Aug 2015 11:28 AM GMT
ఇంకేముంది.. బంగారం ధర కొండకెక్కటమేనా?
X
మొన్నామధ్య పది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.25వేలకు వచ్చేసినప్పుడు.. ఇంకేముంది.. బంగారం ధర పడిపోతుందని ఒకరంటే.. పది గ్రాముల బంగారం రూ.22వేలకు దిగిపోవటం ఖాయమని ఊరించి నోళ్లు చాలామందే ఉన్నారు. కానీ.. అంత భారీగా బంగారం ధర పడిపోవటం సాధ్యం కాదన్న మాట ఎవరైనా చెబితే.. అంతర్జాతీయ పరిస్థితులంటూ చాలానే మాటలు చెప్పారు.

అంతర్జాతీయ పరిస్థితుల మాటేమో కానీ.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని బంగారం ధర తగ్గే అవకాశమే కనిపించని పరిస్థితి. బంగారాన్ని దిగుమతి సుంకం పెంచటమే దీనికి కారణం. తాజాగా దిగుమతి చేసుకునే బంగారం విలువను కేంద్రం 10 గ్రాములకు 354 డాలర్ల నుంచి 363 డాలర్ల కు పెంచింది. మన రూపాయిల్లో అంటే దాదాపు రూ.585 వరకు పెంచింది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో బంగారం ధర మరింత పెరగటమే తప్ప తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. బంగారంతో పాటు.. వెండి దిగుమతి విలువను స్వల్పంగా పెంచింది. వెండి విలువను కేజీ 498 డాలర్ల నుంచి 499 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఎవరైనా బంగారం దిగుమతి చేసుకున్న పక్షంలో సవరించిన మొత్తం ప్రకారం.. విదేశాల్లో కొన్న ధరకు.. స్వదేశంలో సవరించిన ధరకు మధ్యనున్న వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీలో బంగారం ధర పదిగ్రాములు రూ.26,200 చేరింది. ఇప్పటికే శ్రావణమాసం వచ్చేయటం.. పండుగల సీజన్ పుణ్యమా అని.. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరగటం తప్ప.. తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు.