Begin typing your search above and press return to search.

కాస్త విష‌మివ్వండి.. తాగి చ‌స్తా! వైసీపీ కౌన్సిల‌ర్ల‌ను కోరిన ప్ర‌భుత్వ అధికారి

By:  Tupaki Desk   |   3 Sep 2021 8:30 AM GMT
కాస్త విష‌మివ్వండి.. తాగి చ‌స్తా! వైసీపీ కౌన్సిల‌ర్ల‌ను కోరిన ప్ర‌భుత్వ అధికారి
X
2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నో డ‌క్కామొక్కీలు తిని.. 2014లో ఏపీలో ప్ర‌తిప‌క్ష హోదాలో అధికార టీడీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించి పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకుని చివ‌ర‌కు 2019లో జ‌గ‌న్ ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిరోహించారు. బంప‌ర్ మెజార్టీతో తిరుగులేని విధంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ నాయ‌కులు ఒక్క‌సారిగా అధికారంలోకి రాగానే త‌మ స‌త్తా చాటేందుకు సిద్ధ‌మైపోయారు.

కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యాల వ‌ల్ల గ్రామ‌, మండ‌ల స్థాయి వైసీపీ నాయ‌కుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా పోయింది. ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప‌నులు చేయ‌డానికి వాలంటీర్ల‌తో పాటు స‌చివాల‌యాలూ ఉన్నాయి. దీంతో త‌మ‌ను ప‌ట్టించుకునే వాళ్లే లేర‌ని ఆ నాయ‌కులు ఆందోళ‌న చెందారు. ఇలా ఉంటే ఇక లాభం లేద‌ని అనుకున్నారో లేదా మ‌రో రెండున్న‌రేళ్ల‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని భావించారో కానీ అనంత‌పురం జిల్లా వైసీపీ నేత‌లు ఒక్క‌సారిగా త‌మ పంథా మార్చుకున్నారు.

ఆ జిల్లాలోని మండ‌ల స్థాయిలో జ‌రిగే ప్ర‌తి ప‌నిలోనూ త‌మ మాటే నెగ్గించుకునేలా చూస్తున్నారు. అయితే ఆ పార్టీలోనే గ్రూపులు ఎక్కువ కావ‌డంతో ఇప్పుడు వీళ్లంతా క‌లిసి అధికారుల‌పై ఒత్తిడి పెంచుతున్నారు. క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలోని తలుపుల మండలంలో అధికార పార్టీ స్థానిక నేత‌ల గ్రూపు రాజ‌కీయాల వ‌ల్ల ఒత్తిళ్లు పెరిగి అధికారులు ఇక త‌మ వ‌ళ్ల కాద‌ని చేతులెత్తేసే ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ నాయ‌కులు తాము చెప్పినట్లు చేయ‌క‌పోతే ఏసీబీకి ప‌ట్టిస్తామ‌ని అధికారుల‌కు వార్నింగ్‌లూ ఇస్తున్నారంటా.

దీంతో ఎంపీడీవో స‌హా సిబ్బంది అంతా సామూహిక సెల‌వు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయ ఒత్తిళ్ల‌తో ప‌నిచేయ‌లేక‌పోతున్నామ‌ని జ‌డ్పీ సీఈవోకు రాసిన లేఖ‌లో ఈ ఉద్యోగులు స్ప‌ష్టం చేశార‌ని తెలిసింది. అయితే పై అధికారుల జోక్యంతో సెల‌వు విష‌యంలో ఉద్యోగులు వెన‌క్కి త‌గ్గార‌ని స‌మాచారం.

ఇక క‌దిరి మున్సిపాలిటీలోనూ వైసీపీ నేత‌ల పెత్త‌నం ఎక్కువ‌గానే ఉంది. అధికారుల అవినీతి కార‌ణంగా త‌మ‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని కౌన్సిల్ మీటింగ్‌లో ఆరోపించిన కౌన్సిల‌ర్లు అనుమ‌తి లేకుండా నిర్మాణాలు చేస్తున్న టీపీవో ర‌హ‌మాన్‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై వెంట‌నే స్పందించిన టీపీవో తాను అవినీతి చేస్తే నిరూపించాల‌ని కోరారు.

సామాజిక మాధ్య‌మాల్లో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తూ వేధించ‌డం కంటే కొంచెం విష‌మివ్వండి చ‌స్తా అని టీపీవో అన‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్యాఖ్య‌ల‌పై కౌన్సిల‌ర్లు మ‌రింత రెచ్చిపోయి చెట్టుకు క‌ట్టేస్తామ‌ని బెదిరించార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ అధికారుల‌పై వైసీపీ నేత‌ల చ‌ర్య‌ల‌ను క‌ట్ట‌డి చేసే దిశ‌గా ఆ పార్టీ జిల్లా నేత‌లు చొర‌వ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేక‌పోతే పార్టీపై వ్య‌తిరేక‌త పెరిగి ప్ర‌మాదం ఉంద‌నే హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి.