Begin typing your search above and press return to search.

మళ్లీ వెయ్యి నోటు

By:  Tupaki Desk   |   21 Feb 2017 9:30 AM GMT
మళ్లీ వెయ్యి నోటు
X
నవంబరు 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న తరువాత రేగిన అలజడి అంతాఇంతా కాదు. దానివల్ల నల్లధనమేమీ వెల్లడి కాలేదు కానీ.. ప్రజలు మాత్రం కరెన్సీ కోసం కష్టాలు పడ్డారు. అప్పటివరకు ఉన్న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి రూ.2 వేలు, కొత్త రూ.500 నోట్లు ప్రవేశపెట్టారు. అయితే.. రూ.2 వేలు అందుబాటులోకి వచ్చినా దాదాపు 50 రోజుల పాటు రూ.500లు పెద్దగా అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలకు చిల్లర కష్టాలు తెగ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు రూ.500 నోట్లు విస్తారంగా రావడంతో మళ్లీ పరిస్థితి కుదుటపడింది. నవంబరు 8కి ముందు నాటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తోందట. కొత్త రూ.1000 నోటును తేవడానికి రెడీ అవుతోందట. అది అందుబాటులోకి వస్తే నగదు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవడం ఖాయం.

కొత్త సిరీస్‌ వెయ్యినోట్లను ప్రవేశపెట్టడానికి భారత రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయని, ఈ కసరత్తు తుదిదశకు చేరుకున్నదని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే రూ. వెయ్యినోట్ల ముద్రణ ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించిందని, అయితే ఇవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయన్నది ఇంకా తెలియదు.

నిజానికి జనవరి నెల ప్రారంభంలోనే కొత్త వెయ్యినోట్లు మార్కెట్లోకి వస్తాయని సూచనలు అందాయి. కానీ.. ఇంతవరకు దాని జాడే లేదు. చిల్లర సమస్య తీర్చడానికి తొలుత రూ. 500 నోట్లను ముద్రణకు ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త రూ. వెయ్యి నోట్ల రాక ఆగిపోయిందని అంటున్నారు. ఇప్పుడిక వెయ్యి నోటు వస్తే చిల్లర కష్టాలు దాదాపుగా తీరనున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/