Begin typing your search above and press return to search.

మరో వెనకడుగు.. సంచలనంగా ఏపీ సర్కారు నిర్ణయం?

By:  Tupaki Desk   |   10 Dec 2021 6:32 AM GMT
మరో వెనకడుగు.. సంచలనంగా ఏపీ సర్కారు నిర్ణయం?
X
రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే.. సలహాదారులుగా ఎంతమందిని నియమించుకుంటారు? ఒకరు లేదంటే ఇద్దరు. అందుకు భిన్నంగా దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో పెద్ద ఎత్తున సలహాదారుల్ని నియమించుకున్న ఘనత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. మరింత మంది సలహాదారుల్ని నియమించుకున్నప్పుడు.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తూ.. అమితమైన వేగంతో పాలనా రథం దూసుకెళ్లాలి. అందుకు భిన్నంగా ప్రజల నుంచి నిరసనలు.. కోర్టుల నుంచి మొట్టికాయలు.. వెరసి.. కీలక నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేలా చేస్తున్న వైనం తరచూ వార్తాంశాలుగా మారుతున్నాయి.

తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. ఎవరో ఏదో సలహా ఇచ్చినంతనే వెనుకా ముందు చూసుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం.. అందుకు తగ్గట్లుగా జీవోలు జారీ కావటం.. వాటిని సవాలు విసురుతూ కోర్టుకు వెళ్లటం లాంటివి ఒక వరుస క్రమంలో సాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చే సమయానికి.. అడుగు వెనక్కి వేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే గ్రామ.. వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శకులుగా 15 వేల మందిని పోలీసు శాఖలోకి మారుస్తూ జారీ చేసిన జీవో 59పైన పునరాలోచన చేస్తున్నామని.. ఏపీ సర్కారు తాజాగా హైకోర్టుకు వెల్లడించింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం ఖాయమని చెబుతున్నారు. మహిళా పోలీసులుగా మార్చిన ఎంఎస్ కేలకు యూనిఫామ్ వేయించి.. పోలీస్ స్టేషన్ల పరిధిలో పనులు చెప్పటం.. రెవెన్యూ శాఖ ద్వారా నియమితులైన వారిపై స్థానిక ఎస్ హెచ్ వోల పెత్తనం పెరిగింది. అసలు దేహదారుఢ్య పరీక్షలు లేకుండా పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నిర్ణయంపై డీజీపీ సైతం ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాశారు. ఎంఎస్ కేలను మహిళా పోలీసులుగా మార్చే అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు కోర్టును ఆశ్రయించారు. చట్టబద్ధత లేని జీవో 59 వ్యవహారం మెడకు చుట్టుకుంటుందన్న అనుమానం వచ్చిన ప్రభుత్వం.. తాజాగా ఈ జీవోను వెనక్కి తీసుకోవటంతో పాటు.. ఆ విషయాన్ని హైకోర్టుకు నివేదించింది.

ఎంతో ఆలోచించిన తర్వాతే జీవోలు విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. ఇలా చేయటం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.