Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లోని 5 ఆసుపత్రులకు సర్కారు భారీ షాక్

By:  Tupaki Desk   |   29 May 2021 5:30 AM GMT
హైదరాబాద్ లోని 5 ఆసుపత్రులకు సర్కారు భారీ షాక్
X
కొవిడ్ వేళ.. నిబంధనల్ని పాటించకుండా.. కేవలం కాసుల కక్కుర్తికి పాల్పడే ఆసుపత్రులు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటి విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతున్న వేళ.. అదే పనిగా వార్నింగ్ లు ఇచ్చారే కానీ.. వారిపై చర్యలు తీసుకున్నది లేదు. అందుకు భిన్నంగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 66 ఆసుపత్రులపై ఆధారాలతో సహా 88 కంప్లైంట్లు అందగా.. తాజాగా ఐదు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది తెలంగాణ సర్కారు.

ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయటమే కాదు.. ఆయా యాజమాన్యాలు స్పందించిన తీరు ఆధారంగా తాజాగా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఐదు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స అనుమతుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐదు ఆసుపత్రుల్లో ఇకపై కొత్తగా కొవిడ్ రోగుల్ని చేర్చుకోవద్దని.. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి నిబంధనల ప్రకారం చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే మరికొన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసిన అధికారులు.. వారి నుంచి వచ్చిన వివరణ తర్వాత చర్యలు తీసుకునే వీలుందని చెబుతున్నారు. ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడటం.. వైద్య సేవల్ని అందించే విషయంలో చోటు చేసుకున్న అవకతకవల్నిఆధారాలతో అధికారుల ముందుకు బాధితులు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ బంజారాహిల్స్ లోని విరంచి ఆసుపత్రి వైద్యులు.. సిబ్బంది నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చి.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరినా.. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం వివరణ ఇవ్వకపోవటంతో..దానిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఆసుపత్రిపై ఈ తీరులో చర్యలు తీసుకోవటం ఇది రెండోసారి కావటం గమనార్హం. ఇక.. మిగిలిన నాలుగు ఆసుపత్రులు ఏవన్నది చూస్తే..
1. బేగంపేట లోని వీఐఎన్ఎన్ ఆసుపత్రి
2. కాచిగూడలోని టీఎక్స్ ఆసుపత్రి
3. సనత్ నగర్ లోని నీలిమ హాస్పిటల్
4. కుకట్ పల్లిలోని మాక్స్ హెల్త్ హాస్పిటల్