Begin typing your search above and press return to search.

బ్యాంకుల్లో ఏటీఎంల ఖాళీ ఎందుకో చెప్పారు

By:  Tupaki Desk   |   18 April 2018 4:52 AM GMT
బ్యాంకుల్లో ఏటీఎంల ఖాళీ ఎందుకో చెప్పారు
X
కొండ నాలిక్కి మందు వేస్తే ఉన్న నాలుక పోయిన చందంగా మారింది పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం. దేశంలో అవినీతి మ‌కిలి క‌డిగేసి.. అక్ర‌మార్కుల‌కు చుక్క‌లు చూపిస్తామ‌న్నారు. అవినీతి సొమ్మును ఖ‌జానాకు తీసుకెళ్లి నిధుల వ‌ర‌ద పారిస్తామంటూ బ‌డాయి మాట‌లు చెప్పిన మోడీ స‌ర్కార్ చివ‌ర‌కు చేసిందేమిటో అంద‌రికి తెలిసిందే. పెద్ద నోట్ల ర‌ద్దుతో మొద‌లైన న‌గ‌దు కొర‌త అంత‌కంత‌కూ పెరుగుతుందే త‌ప్పించి.. త‌గ్గ‌ని ప‌రిస్థితి.

గ‌డిచిన కొద్ది నెల‌లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ ఏటీఎంలు నో క్యాష్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఏటీఎంలు ఖాళీ కావ‌టం.. న‌గదు కోసం ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. కోట్లాది మంది ప‌డుతున్న తిప్ప‌లుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్ చూస్తే.. ఏటీఎంల ఖాళీ స‌మ‌స్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

తాజాగా కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీకి ట్వీట్ చేసిన కేటీఆర్‌.. బ్యాంకులు.. ఏటీఎంలో న‌గ‌దు కొర‌త ఆక‌స్మికంగా ఏర్ప‌డింది కాదు. తాత్కాలిక‌మైంది కాదు. మూడు నెల‌లుగా హైద‌ర‌బాద్ లో న‌గ‌దు కొర‌త‌పై ప‌లు ఫిర్యాదులు విన్నాం. ఈ కొర‌త‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ‌.. ఆర్ బీఐలు లోతైన కార‌ణాలు అన్వేషించాలి. బ్యాంకుల‌పై ప్ర‌జ‌ల న‌మ్మ‌కానికి సంబంధించిన ఈ స‌మ‌స్య‌ను తేలిగ్గా తీసుకోకూడ‌దు. న‌గ‌దు కొర‌త‌పై నేను విన్న ఫిర్యాదుల‌కు సంబంధించిన వాటికి ఆధారాలు ఉన్నాయి అంటూ ఘాటైన ట్వీట్ ను సంధించారు.

దీనికి స‌మాధానంగా ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. ఏటీఎంల ఖాళీ స‌మ‌స్య పెద్ద‌గా లేద‌న్న‌ట్లు రియాక్ట్ అయ్యారు. మొత్త‌మ్మీదా దేశంలో న‌గ‌దు ప్ర‌వాహం కావాల్సిన దాని క‌న్నా ఎక్కువ‌గా ఉంద‌ని.. బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉంద‌న్నారు. ఆక‌స్మికంగా.. అసాధార‌ణంగా న‌గ‌దు డిమాండ్ పెర‌గ‌టంతోనే కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక కొర‌త ఏర్ప‌డిన‌ట్లుగా పేర్కొన్నారు. తాత్కాలికంగా కొరత అంటే.. ప‌ది రోజులో.. ప‌దిహేను రోజులో ఉంటుంది. కానీ.. మూడేసి నెల‌లుగా స‌మ‌స్య అంత‌కంత‌కూ పెరుగుతుందే కానీ త‌గ్గ‌ని దుస్థితి.

ఇదిలా ఉంటే.. న‌గ‌దు కొర‌త‌పై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో కేంద్ర‌మంత్రి జైట్లీ వారు రియాక్ట్ అయిన దానికి త‌గ్గ‌ట్లే తాజాగా స్పందించారు కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి ఎస్సీ గార్గ్‌. కొన్ని రాష్ట్రాల్లో అనూహ్య‌.. అసాధార‌ణ డిమాండ్ కార‌ణంగానే స‌మ‌స్య వ‌చ్చింది త‌ప్పించి.. న‌గ‌దు కొర‌త లేద‌న్నారు. రూ.2వేల నోట్ల‌ను కొంద‌రు దాచి పెట్ట‌టం కూడా ఈ స‌మ‌స్య‌కు కార‌ణమై ఉండొచ్చ‌న్న అభిప్రాయాన్ని చెప్పారు.

నెల రోజుల్లో రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్ల రూపాయిలు విలువ చేసే కొత్త నోట్ల‌ను అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పారు. రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను కొద్ది రోజులుగా ఆపేశామ‌ని.. ఇప్ప‌టికే రూ.7ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు చెలామ‌ణిలో ఉన్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు రూ.2వేల నోట్ల‌కు సంబంధించి దాదాపు రూ.2ల‌క్ష‌ల కోట్ల విలువైన రూ.2వేల నోట్ల‌ను రిజ‌ర్వ్ లో ఉంచామ‌ని.. న‌గ‌దు కొర‌త స‌మ‌స్య‌ను ప‌రిశీలించి మ‌రో రెండు మూడు రోజుల్లో ప‌రిష్క‌రిస్తామ‌ని ఎస్సీ గార్గ్ వెల్ల‌డించారు.