Begin typing your search above and press return to search.

ఆవు పేడ కొననున్న ప్రభుత్వం.. రైతులకు ఇదీ శుభవార్తే

By:  Tupaki Desk   |   14 Nov 2021 3:30 PM GMT
ఆవు పేడ కొననున్న ప్రభుత్వం.. రైతులకు ఇదీ శుభవార్తే
X
దేశంలో బీజేపీ సర్కార్ వచ్చాక సంప్రదాయాలకు గుర్తింపు పెరిగింది. హిందుత్వ భావజాలం పెరిగింది. ఆవు ఆరాధ్యమైంది. గోమూత్రానికి డిమాండ్ పెరిగింది. గురువులు, మఠాధిపతులు లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే సంప్రదాయ వనమూలికలకు ఆదరణ పెరిగింది. పతంజలి ప్రొడక్టులకు గిరాకీ ఏర్పడింది. ఈ క్రమంలోనే బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన పిలుపునిచ్చారు.

ఆవుపేడ, గోమూత్రంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని.. వీటిని సద్వినియోగం చేసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

ఆవుపేడతో భారత సంప్రదాయం దాగి ఉంది. గ్రామీణ భారతంలో ఆవుపేడతో కల్లాపి చల్లి రాత్రి పడుకునే ముందు పిడకలతో పొగ వరకూ అనేక చోట్ల పేడ ఉత్పత్తులు వాడేవారు. ఆవుపేడ వినియోగం ఇప్పుడు పెరిగింది.

తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవుపేడ, గోమూత్రంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని.. వీటిని సద్వినియోగం చేసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చౌహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతుల నుంచి ఆవు పేడ కొనాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు.

ఆవు పేడ, మూత్రం వినియోగదానికి సరైన వ్యవస్థను తీసుకురాగలిగితే అది మన ఆర్థిక వ్యవస్థకు మరింత బలపడుతుందని ఆయన అన్నారు. ఆవు పేడ కొని వాటి నుంచి ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తులు తయారు చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆవుపేడ, గోమూత్రంతో క్రిమి సంహారిణిలు, ఔషధాలు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేయవచ్చని.. వీటిని చక్కగా ఉపయోగించుకుంటే గ్రామీణ కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు.

మధ్యప్రదేశ్ శ్మశాన వాటికల్లో శవాల దహనానికి కలపకు బదులు పిడకలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం గోశాలలను, సంరక్షణ కేంద్రాలను నెలకొల్పిందని శివరాజ్ సింగ్ చెప్పారు. పశుసంరక్షణకు 109 నంబర్ పై ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.

ఇప్పటికే 2020లో గోధాన్ నయా యోజన పథకాన్ని చత్తీస్ ఘడ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రకారం ప్రభుత్వమే రైతులు, గోశాలల నుంచి ఆవుపేడను కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీన్ని మధ్యప్రదేశ్ లోనూ ఇప్పుడు అమలు చేయనున్నారు.