Begin typing your search above and press return to search.

గవర్నరమ్మ యాక్షన్ షురూ.. కేసీఆర్ సర్కారుకు తాజా ఆదేశాలు

By:  Tupaki Desk   |   22 April 2022 4:28 AM GMT
గవర్నరమ్మ యాక్షన్ షురూ.. కేసీఆర్ సర్కారుకు తాజా ఆదేశాలు
X
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వర్సస్ ముఖ్యమంత్రి ఎపిసోడ్ గురించి తెలిసిందే. తనకు జరిగిన అవమానాల మీద గవర్నర్ తమిళ సై గొంతు విప్పటం.. ఆ తర్వాత ఆమెపై మాటల దాడి మొదలు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వేదిక.. ఈ వేదిక అన్న తేడా లేకుండా గవర్నర్ తమిళ సై తనకు ఎదురైన అవమానాల్ని ఏకరువు పెట్టారు. సాధారణంగా గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి అంటే.. సీఎంలు తెగ ఇబ్బంది పడుతుంటారు. గవర్నర్లు చెలరేగిపోతుంటారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా గవర్నర్ ను ఇబ్బంది పెట్టే ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు.

అయితే.. కేసీఆర్ విసురుతున్న సవాళ్లను తనదైన శైలిలో ఎదుర్కోవటం.. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకున్న గవర్నర్.. తాజాగా తన యాక్షన్ ప్లాన్ షురూ చేసినట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు గవర్నర్ బయటకు వెళ్లిన ప్రతి సందర్బంలోనూ ప్రోటోకాల్ అవమానాన్ని ఎదుర్కొంటున్న ఆమె.. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఎందుకు వ్యవహరించట్లేదన్న సందేహం కలిగిది. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తానేం చేయగలనన్న విషయాన్ని చేతల్లో చూపించారు తమిళ సై.

గడిచిన మూడు.. నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఖమ్మం జిల్లా సామినేని సాయిగణేశ్ ఉదంతంతో పాటు కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకులు ఆత్మహత్యలు చేసుకోవటం.. వీటి వెనుక టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గవర్నరమ్మకు బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. తమ ఫిర్యాదుకు మీడియా.. సోషల్ మీడియా కథనాల్ని జత చేశారు. వీటిపై తాజాగా స్పందించారు గవర్నర్. ఈ రెండు ఉదంతాల మీద తనకు సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కారుకు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు.. పలు ప్రైవేటు వైద్య కాలేజీల్లో పీజీ సీట్లను.. అర్హులైన నీట్ ర్యాంకర్లకు కేటాయించకుండా బ్లాక్ చేసి.. అడ్డదారిలో అమ్ముతున్న అంశంపైనా స్పందించిన తమిళ సై.. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని.. నివేదిక ఇవ్వాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాయలం వీసీని ఆదేశించారు.

మొత్తానికి సంచలన అంశాలపై ప్రభుత్వం నుంచి నివేదికలు పంపాలని ఆదేశించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.