Begin typing your search above and press return to search.

గంటా నేర‌స్థుడే!... గ‌వ‌ర్న‌రే సాక్ష్యం!

By:  Tupaki Desk   |   10 Jan 2019 8:41 AM GMT
గంటా నేర‌స్థుడే!... గ‌వ‌ర్న‌రే సాక్ష్యం!
X
విన‌డానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే... ఏపీ కేబినెట్ లో కొన‌సాగుతున్న ఆ మంత్రిపై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేసింది... ఏ విప‌క్ష నేతో - విప‌క్షానికి చెందిన నేత‌ల‌తో కాదు. రాష్ట్రంలో పాల‌న‌ను ప‌ర్య‌వేక్షిస్తూ... రాజ్యాంగ ప‌రిర‌క్ష‌కుడిగా వ్య‌వ‌హ‌రించాల్సిన కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న గ‌వ‌ర్న‌ర్ నోట నుంచే ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చాయంటే... స‌ద‌రు మంత్రి ముమ్మాటికీ నేర‌స్థుడి కిందే లెక్క‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడి కేబినెట్ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న స‌ద‌రు మంత్రి ఎవ‌రు? ఆయ‌న చేసిన నేరం ఏమిటి? ఆ నేరాన్ని గ‌వ‌ర్నర్ ఎలా ప‌సిగ‌ట్టారు? ఎక్క‌డ గుర్తించారు? మ‌ంత్రిగారి నేరం తెలిసిన త‌ర్వాత గ‌వ‌ర్న్ చేసిన కామెంట్లేమిటి? వాటికి స‌ద‌రు మంత్రి నుంచి వినిపించిన రెస్పాన్స్ ఏమిటి? అన్న వివ‌రాల‌న్నీ తెలియాలంటే... నిన్న విశాఖ కేంద్రంగా అత్యున్న‌త విద్యా సంస్థ‌గా ఎదిగిన ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వం వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. అయితే వెళ్లిపోదాం. పదండి.

నిన్న ఆంధ్రా వ‌ర్సిటీకి సంబంధించి 85 - 86వ స్నాత‌కోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర్సిటీ ఛాన్స‌ల‌ర్ హోదాలో గ‌వ‌ర్న‌ర్ హోదాలో తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ హాజ‌ర‌య్యారు. ఇక ఏపీ కేబినెట్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి హోదాలో టీడీపీ కీల‌క నేత గంటా శ్రీ‌నివాస‌రావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన విద్యార్థులు - అధ్యాప‌కులు - ప్ర‌ముఖుల‌కు డిగ్రీలు - గౌర‌వ డాక్ట‌రేట్ల‌ను ప్ర‌దానం చేయ‌డానికి ముందుకు రొటీన్‌ గా జ‌రిగే ప్ర‌సంగాలు కూడా జోరందుకున్నాయి. గ‌వర్న‌ర్ కంటే ముందుగా మైకందుకున్న గంటా... బాబు స‌ర్కారు హ‌యాంలో ఏపీలో జ‌రిగిన విద్యాభివృద్ధిపై త‌న‌దైన శైలిలో డ‌బ్బాలు కొట్టుకోవ‌డం ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యారంగానికి ఏటా రూ.25 వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తూ రాష్ట్రంలో విజ్ఞాన స‌మాజాన్ని నిర్మించ‌డానికి కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి ప్రైవేటు రంగంలో పేరెన్నిక‌గ‌న్న విద్యా సంస్థ‌లు వస్తున్నాయ‌ని, వాటితో పోటీ ప‌డి ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాలు ఎద‌గాల‌ని సూచించారు. ఈ మాట విన‌ప‌డ‌గానే చిర్రెత్తుకొచ్చిన గ‌వ‌ర్న‌ర్ ఎలాగోలా మంత్రి ప్ర‌సంగం పూర్త‌య్యే దాకా వేచి చూశారు.

ఆ త‌ర్వాత త‌న ప్ర‌సంగంలో భాగంగా ఆదిలోనే మంత్రి ప్ర‌సంగాన్ని - ప్ర‌భుత్వ విద్యాల‌యాల‌పై గంటా చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఓ మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్య‌లు ఎలా చేస్తార‌న్న ఒక్క మాట మిన‌హా... మంత్రిని ఏ స్థాయిలో దులిపేయాలో - ఆ స్థాయిలో దులిపేశారు. అయినా ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాలు... ప్రైవేటు వర్సిటీల‌తో పోటీ ప‌డ‌టం ఏమిట‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శ్నించారు. ప్రైవేటు వ‌ర్సిటీల‌తో ప్ర‌భుత్వ విద్యాల‌యాలు పోటీ ప‌డాల‌ని వ్యాఖ్యానించ‌డం ముమ్మాటికీ నేర‌మేనని మంత్రి స‌భా వేదిక‌పై ఉండ‌గానే గ‌వ‌ర్న‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. విద్యా శాఖ కింద ఏటా వేల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామ‌న్న ప్ర‌భుత్వం... ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల‌ను ఏమేర అభివృద్ధి చేసిందో ఓ సారి ప‌రిశీలించుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రిస్తున్న వింత వైఖ‌రి కార‌ణంగానే ప్ర‌భుత్వ విశ్వ‌విద్యాల‌యాల డిగ్రీ ప‌ట్టాలు అంగ‌డిలో స‌రుకుగా మారాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పూర్వాశ్ర‌మంలో ఐపీఎస్ అధికారిగా ప‌నిచేసిన న‌ర‌సింహ‌న్... ఈ వ్యాఖ్య‌ల‌ను చాలా క్లియ‌ర్‌ గానే ప‌లికారు. గ‌వ‌ర్న‌ర్ నోట ఈ వ్యాఖ్య‌లు వినిపించ‌డం - త‌న నోట నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు నేర‌పూరిత‌మైన‌వేన‌ని గ‌వ‌ర్న‌ర్ తేల్చేయ‌డంతో వేదిక మీదే ఉన్న గంటా కుత‌కుత‌లాడిపోయారు. మ‌రి మంత్రి హోదాలో ఉండి... స‌ర్కారీ విద్యాల‌యాల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌మే కాకుండా... గ‌వ‌ర్న‌రే చేత నేర‌స్తుడిగా ముద్ర వేయించుకున్న గంటాపై సీఎం చంద్ర‌బాబు ఏ త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.