Begin typing your search above and press return to search.

పెద్ద మనసుతో క్షమించాలట.. మహా గవర్నర్ దిద్దుబాటు

By:  Tupaki Desk   |   2 Aug 2022 4:36 AM GMT
పెద్ద మనసుతో క్షమించాలట.. మహా గవర్నర్ దిద్దుబాటు
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు తమ నోటి నుంచి వచ్చే మాట విషయంలో ఆచితూచి అన్నట్లు మాట్లాడేవారు. అందునా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే వారు.. తమ కారణంగా ఆ పదవులకు ఉండే వన్నె తగ్గకూడదన్న పట్టుదలతో వ్యవహరించేవారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండేవారు. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గవర్నర్ గా వ్యవహరించేవారు తమ పరిధిని మరిచిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటమే కాదు.. అవసరం లేని వివాదాలకు తెర తీస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

వీలైనంత వరకు ప్రజల్ని కలిసి కట్టుగా ఉండేలా.. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే తప్పుల్ని సరిదిద్దే పెద్దన్నలా వ్యవహరించాల్సిన గవర్నర్ అందుకు భిన్నంగా.. విభజన రాజకీయాల్ని తన నోటితో తాను ప్రస్తావించటం పెను దుమారమే రేపింది. గుజరాతీలు..రాజస్థానీలు.. మహారాష్ట్రను విడిచి వెళ్లిపోతే.. రాష్ట్రంలో డబ్బేం మిగలదంటూ మాట్లాడటమే కాదు.. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుందని వ్యాఖ్యానించటం ద్వారా పెనుదుమారానికి తెర తీశారు.

ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయటం.. విమర్శల్ని చేశాయి. ఇలాంటివేళ.. తన వ్యాఖ్యలు గురి తప్పాయన్న విషయాన్ని గవర్నర్ అర్థం చేసుకున్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. తనను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ప్రకటనను ట్విటర్ వేదికగా ఆయన వెల్లడించారు.

గవర్నర్ కోశ్యారీ వ్యాఖ్యలపై మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా రియాక్టు అయ్యారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మధ్య విభజన తీసుకొచ్చేలా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు మరాఠీ ప్రజల్ని అవమానించటమేనన్న ఆయన.. ఆయన్ను ఇంటి నుంచి వెల్లగొట్టాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయించుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సైతం గవర్నర్ వ్యాఖ్యల్ని తాము సమర్థించబోమని పేర్కొనటం తెలిసిందే. దీనికి తోడు.. కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలు సైతం గవర్నర్ నోటి మాటను మార్చటంలో కీలకంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు.

ఈ వ్యవహారం మొత్తాన్ని చూసినప్పుడు.. మహరాష్ట్ర గవర్నర్ చేసిన వ్యాఖ్యలు అస్సలు అవసరం లేనివిగా చెప్పొచ్చు. కామ్ గా ఉండకుండా కెలికి కంపు చేసుకున్న పద్దతిలో ఆయన తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో తాను తప్పుగా మాట్లాడి ఉండొచ్చన్న ఆయన.. తనను ప్రజలు పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇన్ని మాటలు చెప్పే బదులు.. తాను చేసిన తప్పునకు తనకు తానే రాజీనామా శిక్షను వేసుకుంటే సరిపోయేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు గీత దాటి మాట్లాడిన వెంటనే అలాంటి వారిని సాగనంపటం ద్వారా.. మిగిలిన వారు జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పాలి. కానీ.. అలాంటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉందా? అన్నదే అసలు ప్రశ్న.