Begin typing your search above and press return to search.

గవర్నర్ గా మర్రి...బిగ్ ఆఫరేనా...?

By:  Tupaki Desk   |   20 Nov 2022 3:30 AM GMT
గవర్నర్ గా మర్రి...బిగ్ ఆఫరేనా...?
X
కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీతో బంధాలను తెంచుకున్నారు. ఆయన బీజేపీ పెద్దలను ఢిల్లీలో కలసి వచ్చిన మీదట కాంగ్రెస్ ని తిట్టిపోశారు. ఫలితంగా బీజేపీ కండువా కప్పుకోకుండానే ఆయన మీద వేటు పడిపోయింది. అయినా సరే ఆయన తన రూట్ కరెక్టే అనుకుంటున్నారు. ఆయన బీజేపీలో చేరడం వెనక పెద్ద వ్యూహమే ఉంది అంటున్నారు.

ఆయన దాదాపుగా ఏడు పదుల వయసులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయనకు ఏ రకమైన పదవులు దక్కే చాన్స్ అయితే లేదు. 1992లో మొదటిసారి సనత్ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయిన శశిధర్ రెడ్డి 2009లో చివరిసారిగా నెగ్గారు. గత రెండు ఎన్నికల నుంచి అయన ఓడిపోతూ వస్తున్నారు.

తండ్రి దివంగత నేత మర్రి చెన్నారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శశిధర్ రెడ్డి ఆ స్థాయిలో సగం కూడా హవా చూపించలేకపోయారు. అయినా సరే మర్రి కుమారుడిగా కాంగ్రెస్ ఆయనను గౌరవించింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ విపత్తుల సంస్థకు చైర్మన్ చేయడం ద్వారా క్యాబినేట్ ర్యాంక్ పదవిని ఇచ్చింది.

అలాగే పార్టీ పదవులలో కూడా పెద్ద పీట వేసింది. ఇన్ని చేసిన కాంగ్రెస్ కి జూనియర్ మర్రి నుంచి ఎలాంటి ప్రతిఫలమూ దక్కలేదనే అంటారు. ఆయన మాజీ సీఎం కుమారుడిగా స్టేట్ లెవెల్ నేతగా ఉన్నా ఆయన పలుకుబడితో పార్టీని డెవెలప్మెంట్ చేసింది లేదు అన్న విమర్శలు ఉన్నాయి.

మరి ఆయన మనసులో కూడా పీసీసీ చీఫ్ కావాలని ఉందేమో తెలియదు, అదే టైం లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయడంతో సీనియర్ నేతగా ఆయన కూడా తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారని అంటున్నారు. ఏది ఏమైతేనేమి ఆయన బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు.

ఆయన వల్ల తెలంగాణాలో బీజేపీకి ఏమి ఒనగూడుతుంది అన్నది పక్కన పెడితే ప్రత్యేక తెలంగాణా కోసం తొలిసారి ఉద్యమించి ప్రజా రాష్ట్ర సమితిని పెట్టి 1970 దశకంలో పోరాటయోధుడిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి వారసుడిగా ఉండడం తమకు కలసి వస్తుందని కమలం పార్టీ లెక్క వేసుకుంటోంది.

అంతే కాదు రెండు సార్లు ఉమ్మడి ఏపీకి సీఎం గా మర్రి చెన్నారెడ్డి పనిచేయడంతో ఆయన ఇమేజ్ ని ఎంతో కొంత తమ వైపు తిప్పుకోవచ్చు అని ఆలోచనతో శశిధర్ రెడ్డిని చేర్చుకున్నారు అని అంటున్నారు. ఇక ఆయనకు గవర్నర్ పదవిని ఆఫర్ చేసి తమ వైపు తిప్ప్పుకున్నారని అంటున్నారు. మర్రి చెన్నారెడ్డి కూడా గతంలో యూపీ తమిళనాడులకు గవర్నర్ గా పనిచేశారు.

తండ్రిలా సీఎం కాలేకపోయినా కనీసం గవర్నర్ గా అయిన రాజ్ భవన్ లో కొలుగుతీరితే వారసత్వానికి అదే దక్కిన ఘనత అని జూనియర్ మర్రి భావించారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆయన బీజేపీ గూటికి అయితే చేరారు. ఏ రాష్ట్రానికి ఆయనకు గవర్నర్ ని చేస్తారో చూడాలి. దాని కంటే ముందు ఒక కండువా కప్పీఅసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ విజయం కోసం పనిచేయమని గట్టిగా చెబుతారు అని అంటున్నారు.

ఆ మీదట ఆయన పెర్ఫార్మెన్స్, తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చే దాని బట్టి మర్రికి గవర్నర్ గిరీ ఆధారపడినా ఆశ్చర్యం లేదు. ఇక మర్రి వంటి ఘనమైన ఇమేజ్ కలిగిన రాజకీయ కుటుంబ నేతను తమ వైపునకు తిప్పుకుంటే ఒదే ఊపులో మరింతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ బాట పడతారని కూడా కమలం పార్టీ అంచనా వేస్తోంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.