Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కలిసొచ్చిన గవర్నర్ తో క్లోజ్ నెస్!

By:  Tupaki Desk   |   8 Oct 2016 4:50 AM GMT
కేసీఆర్ కు కలిసొచ్చిన గవర్నర్ తో క్లోజ్ నెస్!
X
తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అవుతుంటారు. ఏకాంతంగా చర్చలు జరుపుతుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనే కాదు.. నిర్ణయాలు ఏమీ తీసుకోకున్నా ఆయన కలుస్తుంటారు. ఈ భేటీలపై రాజకీయ నేతలు పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వాటిని కాసేపు పక్కన పెట్టినా.. తరచూ గవర్నర్ తో భేటీ అయ్యే ముఖ్యమంత్రికి కలిగే ప్రయోజనం ఎలా ఉంటుందన్నది తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

కొత్త జిల్లాల వ్యవహారం నెలల ముందు కసరత్తు మొదలెట్టినా.. ఆఖరి క్షణం వరకూ ఉరుకులు పరుగులు తప్పేటట్లు లేవు. కొత్త జిల్లాల ఏర్పాటు చెప్పినంత ఈజీ ఏమీ కాదు. చేయాల్సిన పని బోలెండత. జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ డివిజన్లు.. మండలాలు.. సరిహద్దులు.. జిల్లా కేంద్రాల ఏర్పాటు.. అధికారుల నియమకాలు ఇలా చెప్పుకుంటూ చాంతాడంత లిస్ట్ ఉండే పరిస్థితి. వీటన్నింటికి తోడు ప్రభుత్వ పరంగా చేయాల్సిన కీలక పనులు కొన్ని ఉంటాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చట్టానికి మార్పులు చేర్పులు చేయటంతో పాటు.. క్యాబినెట్ ఆమోద ముద్ర వేయటం.. దానికి గవర్నర్ ఓకే అనటం.. ఆపై అధికారికంగా నోటిఫికేషన్ దాఖలు చేయటం లాంటి పెద్ద ప్రొసీజరే ఉంది.

ఇలాంటప్పుడు ఏ పని.. ఎక్కడ కాస్త ఆలస్యమైనా.. మొత్తం వ్యవహారం మీద ప్రభావం చూపుతుంది. ఇలాంటి వేళ.. పనులు ఎక్కడా ఆగకుండా జోరుగా సాగేందుకు పరిచయాలు.. సానిహిత్యం చాలా అవసరం అవుతుంది. మంత్రివర్గం ఆమోదించిన ఒక అంశంపై గవర్నర్ తన ఆమోద ముద్ర వేయకుంటే చాలు.. మొత్తం ప్రక్రియ పుల్ స్టాప్ పడుతుంది. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా.. గవర్నర్ తో సన్నిహిత సంబంధాలు నెరపటంతో పాటు.. ఆయన సలహాలు.. సూచనల్ని తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటారు కేసీఆర్. ఆయన తరచూ ప్రదర్శించే మర్యాదకు ముగ్ధుడయ్యే గవర్నర్.. సీఎంకు ఎలాంటి చికాకులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.

తాజాగా కొత్తజిల్లాల ఏర్పాటు విషయాన్నే తీసుకుంటే.. జిల్లాల్ని అధికారికంగా ప్రారంభించటానికి కేసీఆర్ అనుకున్న సమయానికి ఇంకా మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇంతవరకూ జిల్లాల పేర్లే ప్రకటించని పరిస్థితి. అంతకు ముందు.. జిల్లాల ఏర్పాటుకు వీలుగా చట్టానికి సవరణ చేయాల్సిన పరిస్థితి. కొత్తజిల్లాల వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకువీలుగా.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణపై రాష్ట్ర సర్కారు శుక్రవారం రాత్రి వేళ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

అనంతరం.. తెలంగాణ జిల్లాల ఏర్పాటు సవరణ ఆర్డినెన్స్ పేరిట విడుదల చేసింది. దీనికి ముందు చాలానే కసరత్తు జరిగిందని చెప్పక తప్పదు. ముందుగా మంత్రిమండలి సమావేశమై.. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారికంగా నిర్ణయం తీసుకొని.. దాన్ని గవర్నర్ కు పంపారు. నిజానికి ఇలాంటి అంశాల మీద ఒకట్రెండు రోజులు టైం తీసుకున్నా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. అదే పరిస్థితి ఎదురైతే..దసరా రోజున కొత్త జిల్లాల్ని ప్రారంభించాలనుకున్న ప్లాన్ మొత్తం పాడవుతుంది. ఇలాంటి వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. గవర్నర్ తో ఉన్న సాన్నిహిత్యం అక్కరకు వచ్చిందనే చెప్పాలి. కొత్త జిల్లాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న వెంటనే.. దాన్ని గవర్నర్ కు పంపారో లేదో.. ఆయన వెంటనే రాజముద్ర వేసేసి తన ఆమోదాన్ని తెలిపేశారు. దీంతో.. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చట్టానికి చేసిన సవరణ అధికారికమైపోయింది. దీంతో.. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన సాంకేతక సమస్య తీరిపోయిందని చెప్పాలి. మొత్తానికి గవర్నర్ తో కేసీఆర్ కున్న క్లోజ్ నెస్ ఈసారి ఇలా ఉపయోగపడిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/