Begin typing your search above and press return to search.

గవర్నర్‌ సాబ్‌.. మీడియా వైపు కూడా చూడలేదేంటి?

By:  Tupaki Desk   |   26 Jun 2015 8:31 AM GMT
గవర్నర్‌ సాబ్‌.. మీడియా వైపు కూడా చూడలేదేంటి?
X
కర్ర విరగకుండా.. పాము చావకుండా సమాధానాలు చెప్పటం చాలా కష్టం. అందులోకి మీడియా సమక్షంలో ఇలాంటి చాలా చాలా ఒత్తిడితో కూడుకున్నవి. భావోద్వేగాల్ని నియంత్రించుకొని ప్రశాంతంగా మాట్లాడటం.. మాట్లాడే మాటల్లో ఏ పాయింట్‌ దొరక్కుండా ఉండేలా చూసుకోవటం అంత తేలికైన వ్యవహారంకాదు.

మిగిలిన వారి సంగతిని పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌లో ఒక విలక్షణత ఒకటి కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. గవర్నర్‌ మీడియా దగ్గరకు రావటమో లేదంటే.. గవర్నర్‌ను తన వద్దకు రప్పించుకోవటమో చేసి.. వారితో ఏదో ఒకటి మాట్లాడతారు. ఆయన మాటలో నో కామెంట్‌ అన్న పదం పదిసార్లు చెప్పేందుకే అయినా మీడియా వద్దకు వచ్చి వెళతారు.

అలా మీడియాను నొప్పించకుండా వ్యవహరిస్తూ ఉండే ఆయన.. ఒక్కోసారి ఆధ్యాత్మిక తరహాలో వ్యాఖ్యలు చేస్తారు. అలా అని అవి వివాదాస్పదం కాకుండా చూసుకునే నేర్పు గవర్నర్‌ సొంతం. అలాంటి ఆయన.. శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం అయిన తర్వాత.. మీడియా వంక కూడా చూడకుండా సీరియస్‌గా వెళ్లిపోయారు. అలాంటి వైఖరి నరసింహన్‌ దగ్గర చాలా అరుదుగా కనిపిస్తుంటుంది? ఇలా మీడియా వంక చూడకుండా.. సీరియస్‌గా వెళ్లిపోవటం వెనుక మతలబు ఏమిటి? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.