Begin typing your search above and press return to search.

పెళ్లి పందిట్లో ఉగ్రుడైన గవర్నర్

By:  Tupaki Desk   |   18 March 2016 6:49 AM GMT
పెళ్లి పందిట్లో ఉగ్రుడైన గవర్నర్
X
రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ అప్పుడప్పడు ధర్మాగ్రహన్ని ప్రదర్శిస్తుంటారు. విద్య.. వైద్య విధానాల మీద ఆయనలో చాలానే ఆగ్రహం ఉంది. అప్పుడప్పడు దాన్ని కొన్ని కార్యక్రమాల్లో బయటపెడుతుంటారు. అలాంటి ఆయన.. తాజాగా మాత్రం ఒక పెళ్లి పందిట్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. కార్యక్రమం మధ్యలో చెప్పాపెట్టకుండా వెళ్లిపోవటం సంచలనంగా మారింది. అయితే.. ఈ పెళ్లి కార్యక్రమం ప్రైవేటు వ్యక్తులది కాదు.. దేవుడి పెళ్లి. కన్ఫ్యూజింగ్ గా ఉందా? మరింత వివరంగా చెబుతాం వినండి.

దైవ కార్యక్రమాల్ని సంప్రదాయాలకు తగ్గట్లుగా నిర్వహించే గవర్నర్ నరసింహన్.. యాదాద్రిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా హాజరయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8.30 గంటలకు యాదాద్రికి వెళ్లారు గవర్నర్. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం.. 9.45 గంటలకు స్వామివారు కల్యాణమండపానికి రావాల్సి ఉంది. కానీ.. స్వామివారి విగ్రహ రూపులు మండపానికి రాలేదు.

ముందుగా నిర్ణయించిన ముహుర్తానికి దాదాపు 18నిమిషాలుఆలస్యంగా 10.03 నిమిషాలకు దేవతామూర్తుల్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఈ ఆలస్యంపై ఆలయ ఈవో గీతారెడ్డిని వివరణ కోరినప్పుడు.. కొందరుప్రజాప్రతినిధులు రావాల్సి ఉండటంతో ఆలస్యం అయ్యిందని చెప్పటంతో గవర్నర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

మీ ఇష్టం వచ్చినట్లుగా చేయలానికి ఎవరింట్లో పెళ్లి అనుకుంటున్నారు? అన్ని సమయం ప్రకారం ఎందుకు జరపటం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. వేడుక నుంచి అర్థాంతరంగా వెల్లిపోయారు. స్వామివారి మంగాళ్య ధారణ పూర్తి కాకముందే.. పెళ్లికి వచ్చిన సంప్రదాయ దుస్తులతోనే గవర్నర్ తిరిగి వెళ్లిపోవటం హాట్ టాపిక్ గా మారింది. అయినా.. దైవ కార్యక్రమ నిర్వహణలో ముహుర్తానికి ఎంతో ముఖ్యమన్న విషయాన్న దేవాలయ అధికారులు విస్మరించటం ఏమాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది.