Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ టీడీపీ నేత‌కు గ‌వ‌ర్న‌ర్ దిమ్మ తిరిగే షాక్!

By:  Tupaki Desk   |   11 Dec 2018 3:03 AM GMT
సీనియ‌ర్ టీడీపీ నేత‌కు గ‌వ‌ర్న‌ర్ దిమ్మ తిరిగే షాక్!
X
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శ‌క్తివంత‌మైన వ్య‌క్తి ఎవ‌ర‌న్న ప్ర‌శ్న వేయండి. చాలామంది అయితే కేసీఆర్ అనో.. లేదంటే చంద్ర‌బాబు అనో.. ఇంకేదో పేర్లు చెప్పేస్తారు. కానీ..వారంద‌రికంటే అత్యంత శ‌క్తివంత‌మైన వ్య‌క్తి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో గ‌తంలో గ‌వ‌ర్న‌ర్లుగా ప‌ని చేసిన వారెవ‌రూ చేయ‌లేనంత ప్ర‌భావాన్ని న‌ర‌సింహ‌న్ చేస్తున్నార‌ని చెప్పాలి.

గ‌వ‌ర్న‌ర్ అంటే ర‌బ్బ‌ర్ స్టాంప్ అన్న ఫీలింగ్‌ను గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దాదాపుగా చెరిపేశార‌ని చెప్పాలి. తాము తీసుకునే నిర్ణ‌యాల్ని గ‌వ‌ర్న‌ర్ కు త‌ర‌చూ అప్డేట్ ఇవ్వ‌టం మ‌రే రాష్ట్రంలోనూ క‌నిపించ‌దు. కానీ.. కేసీఆర్ కానీ.. అప్పుడ‌ప్పుడు చంద్ర‌బాబు కూడా ఆ ప‌ని చేస్తుంటారు. నిజానికి ఎంత సామ‌ర్థ్యం లేకుంటే.. కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉన్నా త‌న కుర్చీకి ఎలాంటి ముప్పు వాటిల్ల‌కుండా చూసుకుంటార‌న్న‌ది చూస్తే.. న‌ర‌సింహ‌న్ గొప్ప‌త‌నం ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

అప్పుడెప్పుడో యూపీఏ జామానాలో ఉమ్మ‌డి రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా వ‌చ్చిన ఆయ‌న‌.. త‌న హ‌యాంలో ప‌లువురు ముఖ్య‌మంత్రులు సీఎం కుర్చీలో కూర్చొని వెళ్లిపోవ‌టం చూశారు. కానీ.. ఆయ‌న మాత్రం అలానే ఉండిపోయారు. రాబోయే రోజుల్లో కూడా ఉండిపోతార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా గ‌వ‌ర్న‌ర్ తో కూట‌మి నేత‌లు భేటీ అయిన సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ వేసిన స‌ర‌దా పంచ్ కు టీటీడీపీ త‌మ్ముడు షాక్ తిన్నార‌ని.. ముఖంలో ర‌క్తం చుక్క లేద‌ని చెబుతారు.

తాను స‌ర‌దాగానే అన్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పినా.. ఎందుకొచ్చిన గొడ‌వ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన తెలుగు త‌మ్ముడి తీరు గురించి ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు హంగ్ వ‌చ్చిన ప‌క్షంలో కూట‌మిగా త‌మ‌కే ముందు అవ‌కాశం ఇవ్వాల‌న్న విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ కు అడ్వాన్స్ గా చెప్పేందుకు నిన్న (సోమ‌వారం) రాజ్ భ‌వ‌న్ కు వెళ్లారు టీ కాంగ్రెస్ .. టీటీడీపీ నేత‌లు. వారితో పాటు కూట‌మికి చెందిన నేత‌లు ఉన్నారు. అలా వెళ్లిన వారు గ‌వ‌ర్న‌ర్ ఎదుట త‌మ వాద‌న‌ను వినిపిస్తున్న వేళ‌.. గ‌వ‌ర్న‌ర్ ఎదురుగా కూర్చొన్న టీటీడీపీ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఏదో చెప్ప‌బోయారు.

అంద‌రూ చెబుతున్న మాట‌ల్ని శ్ర‌ద్ద‌గా వింటున్న గ‌వ‌ర్న‌ర్.. అదేంటి? మీరు ఎప్పుడు వ‌చ్చినా నిల‌బ‌డి మాట్లాడ‌తారు.. ఈసారి ఎదురుగా కూర్చున్నారే అంటూ రావుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించ‌టంతో ఆయ‌న ఒక్క‌సారిగా కంగుతిన్న‌ట్లు చెబుతున్నారు. వెంట‌నే ఆయ‌న లేవ‌గా.. స‌ర‌దాగా అన్నాను.. వ‌చ్చి కూర్చోండ‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. రావుల మాత్రం నిల‌బ‌డే ఉండ‌టం గ‌మ‌నార్హం. స్థాయి ఏదైనా.. ఒక నేత వ‌చ్చి త‌న ఎదుట కూర్చోవ‌టాన్ని స‌ర‌దాగా అయినా ఒక గ‌వ‌ర్న‌ర్ గ‌మ‌నిస్తుంటారా? అన్న ప్ర‌శ్న మ‌దిలో మెదిలిన‌ప్పుడు ఎప్పుడూ ఒక‌లా క‌నిపించే న‌ర‌సింహ‌న్ మ‌రో ర‌కంగా క‌నిపించ‌టం ఖాయం. ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీర‌వుతార‌ని అంటారు. కొన్నేళ్లుగా కేసీఆర్ తో స‌న్నిహితంగా ఉంటార‌న్న పేరున్న గ‌వ‌ర్న‌ర్ .. త‌న ఎదురు కూర్చునే నేత‌లు ఎవ‌రు? నిల‌బ‌డే నేత‌లు ఎవ‌ర‌న్న లెక్క‌ల్ని వేసుకోవాల్సిన అవ‌స‌రం లేదేమో?