Begin typing your search above and press return to search.

సామాన్య రోగిగా గ‌వ‌ర్న‌ర్‌.. గాంధీలో వైద్యం!

By:  Tupaki Desk   |   23 Aug 2017 9:17 AM GMT
సామాన్య రోగిగా గ‌వ‌ర్న‌ర్‌.. గాంధీలో వైద్యం!
X
తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అన్న‌మాట నిల‌బెట్టుకున్నారు. రెండు రాష్ట్రాల‌కు ప్ర‌థ‌మ పౌరుడే అయిన‌ప్ప‌టికీ.. మాట మీద నిల‌బ‌డ్డారు. అత్యున్న‌త ప‌దవుల్లో ఉన్న‌వారికి ఆద‌ర్శంగా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు, తాను కూడా ఓ సామాన్య పౌరుడినేన‌ని నిరూపించారు. విష‌యం ఏంటో చూద్దాం.. గ‌వ‌ర్న‌ర్‌ గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేసిన గ‌వ‌ర్న‌ర్‌.. సామాన్యుల‌కు అందుతున్న వైద్యం.. అందునా ప్ర‌భుత్వం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి మ‌రీ నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో అందుతున్న వైద్యంపై అనేక సంద‌ర్భాల్లో పెద‌వి విరిచారు.

తాపీ ప‌ట్టుకోకుండా మేస్త్రీ గోడ‌క‌ట్టిన‌ట్టు.. మ‌న వైద్యులు రోగి చేయి ప‌ట్టుకోకుండానే వైద్యం చేస్తున్నార‌ని అనేక సంద‌ర్భాల్లో గ‌ట్టిగానే చుర‌క‌లంటిచారు. అంతేకాదు, ఆయ‌న‌కు అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్బంలోనూ తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల‌కు అందుతున్న వైద్యంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. వైద్యులు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అనేక వేదిక‌ల‌పై గొంతెత్తి హెచ్చ‌రించారు. అయినా కూడా వైద్యుల్లో మార్పు క‌నిపించ‌లేదు. అయితే, వైద్యుల‌ను మార్చే క్ర‌మంలో న‌ర‌సింహ‌నే ఓ సామాన్యుడిగా మారిపోవాల‌ని డిసైడ్ అయ్యారు.

నిజానికి ఆయ‌న ఏవైద్య అవ‌స‌రం వ‌చ్చినా.. రాజ్ భ‌వ‌న్ స‌మీపంలోని ఓ కార్పొరేట్ ఆస్ప‌త్రికి వెళ్లేవారు. అక్క‌డి సూప‌ర్ స్పెషాలిటీలో ఆయ‌న‌, ఆయ‌న స‌తీమ‌ణి వైద్యం చేయించుకునేవారు. అయితే, సామాన్యుల‌కు సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం అందాలంటే.. ముందు తాను మారాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వెంట‌నే ఆయ‌న త‌న‌కు ఏ వైద్య అవ‌స‌రం ఎదురైనా.. సామాన్యులు వైద్యం చేయించుకునే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కే వ‌స్తాన‌ని ఇటీవ‌ల వెల్ల‌డించారు. క‌నీసం గ‌వ‌ర్న‌ర్ ఎప్పుడొస్తారో ఏమో.. అనే భ‌యంతోనైనా వైద్యులు స‌క్ర‌మంగా విధులు నిర్వ‌హించి సామాన్యుల‌కు సేవ చేస్తార‌ని తాను ఆశిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న సాధార‌ణ‌, పేద రోగులు ఎక్కువ‌గా వ‌చ్చే గాంధీ ఆస్ప‌త్రిని ఎంచుకున్నారు. ఇక‌పై తాను ఏవైద్య అవ‌స‌రం వ‌చ్చినా గాంధీ ఆస్ప‌త్రికే వ‌స్తాన‌ని వెల్ల‌డించారు. అయితే, అందరూ గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను లైట్ తీసుకున్నారు. కానీ, ఆయ‌న అన్న‌ది చేసి చూపించారు. బుధ‌వారం సాధార‌ణ చెక‌ప్‌ లో భాగంగా ఆయ‌న ఓ సామాన్యుడిలా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలోని ఓపీ విభాగానికి వెళ్లి - వైద్యం చేయించుకున్నారు. కొన్ని రోజుల క్రితం న‌ర‌సింహ‌న్ కాలుకి గాయం అయింది. ఆ విష‌యాన్ని వైద్యుల‌కు తెలిపారు. ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన గాంధీ ఆసుప‌త్రి వైద్యులు.. స్వ‌ల్ప శ‌స్త్ర చికిత్స చేయాల‌ని చెప్పారు. కాగా, గ‌వ‌ర్న‌ర్ వ‌స్తున్నార‌ని వార్త రావ‌డం తో ఆస్ప‌త్రిలో అంద‌రూ అలెర్ట్ అయిపోయారు. ప‌రిస‌రాల‌ను శుభ్రం చేయ‌డంతోపాటు సామాన్యుల‌కు చేయి ప‌ట్టుకుని మ‌రీ వైద్యం అందించారు. సో.. ఏదేమైనా.. ఈ ఒక్క‌రోజు.. గ‌వ‌ర్న‌ర్ ఆశ‌యం నెర‌వేరింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.