Begin typing your search above and press return to search.

మన గవర్నరుకూ ఊస్టింగ్ తప్పదా?

By:  Tupaki Desk   |   13 Sep 2016 10:04 AM GMT
మన గవర్నరుకూ ఊస్టింగ్ తప్పదా?
X
రెండు తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహ‌న్‌ ను కేంద్రం ఢిల్లీకి రావాల‌ని ఆదేశించడం... ఆయన ఢిల్లీ చేరుకోవడంతో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న ఈరోజు ప్రధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణ‌ - ఏపీల్లోని ప‌రిస్థితుల‌పై ప్రధానితో చర్చించేందుకు ఆయన వెళ్లారని చెబుతున్నా అసలు పరిస్థితులు వేరని తెలుస్తోంది. గవర్నరును మార్చే ఉద్దేశంతోనే రాజీనామా చేయమని కోరేందుకు ఆయన్ను పిలిపించి ఉంటారన్న వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది. తాజాగా అరుణాచల్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ ఖోవాను పదవి నుంచి తొలగిస్తూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో నరసింహన్ కు కూడా పిలుపు రావడంతో అనుమానాలు వినిపిస్తున్నాయి.

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జె.పి.రాజ్‌ ఖోవాను విధుల నుంచి తప్పిస్తూ, మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్‌ కు అరుణాచల్ గవర్నర్‌ గా అదనపు బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. తాను ఎట్టి పరిస్థితిలోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని - రాష్టప్రతి తనపై విశ్వాసాన్ని కోల్పోయి, తనను తొలగించాల్సిందేనని రాజ్‌ ఖోవా ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిరుడు అరుణాచల్‌ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించటం, ఆ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు పునరుద్ధరించిన వ్యవహారంలో గవర్నర్ పాత్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేసిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల మధ్య కూడా వివాదాలు రోజురోజుకూ పెరుగుతుండడం.. వాటిని పరిష్కరించడంలో గవర్నరు క్రియాశీలంగా లేకపోవడంతో ఆయన స్థానంలో వేరొకరిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే... కొత్త రాష్ట్రాలు కావడంతో అనుభవం ఉన్న గవర్నరుగా ఆయన్నే కొనసాగించాలని ఇంతకాలం అనుకున్నప్పటికీ ఎన్నికలు మరో రెండేళ్లలో రానున్న నేపథ్యంలో రాజకీయ అవసరాల దృష్ట్యా కూడా ఆలోచించి గవర్నరును మార్చాలనే ఆలోచనకు వచ్చినట్లు వినిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. అయితే... ఇరు రాష్ట్రాల మధ్య నెల‌కొన్న వివాద‌ అంశాలు - ఢిల్లీలోని ఏపీ భవన్ పంపిణీ - ఉద్యోగుల విభ‌జ‌న - ప‌లు శాఖ‌లు - హైద‌రాబాద్‌ లోని వివిధ భ‌వ‌నాల విభ‌జ‌న అంశాల‌ను గురించి కూడా గవర్నరు మొత్తం రిపోర్టు మోడీకి అందజేస్తారని తెలుస్తోంది. మోదీతో భేటీ త‌రువాత ఆయ‌న కేంద్ర‌ హోం శాఖ అధికారులను క‌ల‌వ‌నున్నట్లు స‌మాచారం. అయితే... తన పదవి కొనసాగింపుపై కేంద్రాన్ని గవర్నరు కోరుతారా లేదంటే కేంద్రం సూచనల ప్రకారం సాగుతారా అన్నది తెలియాల్సి ఉంది.