Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల మధ్యన దేశ ప్రధమ పౌరుడు

By:  Tupaki Desk   |   27 Dec 2016 6:24 PM GMT
చంద్రుళ్ల మధ్యన దేశ ప్రధమ పౌరుడు
X
విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన దేశ ప్రధమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దాదాపు ఒకే సమయంలో వచ్చిన ఈ ఇద్దరు చంద్రుళ్లు.. రాష్ట్రపతికి ఇరువైపులా ఆసీనులయ్యారు. ఇద్దరు చంద్రుళ్ల మధ్య రాష్ట్రపతి వెలిగిపోయారనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి రాజకీయ వీవీఐపీలు పలువురు హాజరయ్యారు. పారిశ్రామిక.. క్రీడా ప్రముఖులు కూడా వచ్చారు.

విందు సందర్భంగా చోటు చేసుకున్న పలు ఆసక్తికర అంశాల్ని చూస్తే..

= రాష్ట్రపతి ప్రణబ్ కు చెరోవైపు కూర్చున్న ఇద్దరు చంద్రుళ్ల విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రణబ్ కాసేపు మాట్లాడటం కనిపించింది. చంద్రబాబుతో అంత ఎక్కువగా ఆయన మాట్లాకపోవటం గమనార్హం. అనంతరం.. రాష్ట్రపతిని కలిసేందుకు వచ్చే అతిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు తాను కూర్చున్న కుర్చీలో నుంచి తొలుత వెళ్లిపోగా.. ఆ తర్వాత కేసీఆర్ లేచారు. కేసీఆర్ పక్కన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూర్చున్నారు.

= ఇరువురు చంద్రుళ్లు మాట్లాడుకోవటం కనిపించింది.ఇరువురు మధ్యా కాసేపు మాటలు సాగాయి. ఈ సందర్భంగా తాగేందుకు కూల్ డ్రింక్స్.. తేనీరు తీసుకొచ్చినా కేసీఆర్ ఏం తీసుకోకుండా ఉంటే.. చంద్రబాబు మాత్రం తేనీరు తీసుకున్నారు.

= కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వచ్చిన సందర్భంగా ప్రణబ్ సన్నిహితంగా మాట్లాడటం కనిపించింది. ప్రణబ్ చేతిలో చెయ్యి వేసిన జానారెడ్డి.. ఫోటోకు ఫోజుచ్చి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన షబ్బీర్ అలీతో కూడా ప్రణబ్ దా క్లోజ్ గా మాట్లాడటం కనిపించింది.

= తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా ఆయన పాదాలకు నమస్కారం చేశారు.

= టెన్నిస్ స్టార్ సానియామీర్జా.. బ్యాడ్మింటన్ సంచలనం సింధులు ప్రణబ్ కు చెరోపక్కన కూర్చొని ఫోటో దిగగా.. సానియా పక్కన గోపీచంద్ కూర్చున్నారు. బ్లాక్ డ్రెస్సు ధరించిన సానియా చాలా సింఫుల్ గా కనిపించారు.

= ఇరువురు చంద్రుళ్లు చాలాసేపు నిలుచొని మాట్లాడుతున్న వేళ.. ఆవైపు వచ్చిన పలువురు చంద్రబాబుతో ఎక్కువసేపు మాట్లాడటం కనిపించింది.

= తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ప్రణబ్ ను కలుసుకునేందుకు వచ్చినప్పుడు.. ఆయన్ను చంద్రబాబు పలుకరించగా.. కేసీఆర్ పెద్దగా మాట్లాడకపోవటం గమనార్హం.

= ఇరువురు చంద్రుళ్లు ప్రణబ్ ను కలిసిన తర్వాత.. కాసేపటికి గవర్నర్ దంపతులు వారిద్దరిని మరోసారి రాష్ట్రపతి పక్కన కూర్చోబెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు పక్కన గవర్నర్ నరసింహన్ కూర్చోగా.. కేసీఆర్ కు కాస్త దూరంలో బండారు దత్తాత్రేయ కూర్చున్నారు. అప్పుడప్పుడు కేసీఆర్ తో ప్రణబ్ దా మాట్లాడటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/