Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ పేచీ తేల్చేయ‌నున్న గ‌వ‌ర్న‌ర్

By:  Tupaki Desk   |   9 March 2017 4:58 AM GMT
ఏపీ, తెలంగాణ పేచీ తేల్చేయ‌నున్న గ‌వ‌ర్న‌ర్
X
ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మ‌డి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ రెండు రాష్ర్టాల మ‌ధ్య నెల‌కొన్న కీల‌క పేచీల‌పై నేడు తేల్చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉమ్మడి సంస్థల విభజన సమస్యలపై హైదరాబాద్‌ లో గవర్నర్‌ సారధ్యంలో ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల మంత్రుల కమిటీలు భేటీ కానున్నాయి. గత నెల 26లో సమావేశం జరగాల్సి ఉండగా ఉభయ రాష్ట్రాల బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సమావేశాన్ని మార్చి 9కి వాయిదా వేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి సంస్థల విభజనకు సంభందించిన వివాదం ఒక కొలిక్కి రానున్నట్లు భావిస్తున్నారు. ఉమ్మడి సంస్థల విభజన సమావేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు - అచ్చెన్నాయుడు - చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసరావు - తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు హరీష్‌ రావు - జగదీశ్‌రరెడ్డి - అంత‌రాష్ట్ర సంబంధాల స‌ల‌హాదారు వివేక్ పాల్గొంటారు.

ఈ స‌మావేశంలో ప్రధానంగా ఆస్తులు, అప్పులు లేని పాలక మండళ్ళులేని సంస్థల విభజన పై చర్చించే అవకాశం ఉంది. వీటిలో మానవ హక్కుల కమిషన్‌ - సమాచార హక్కు చట్టం(సమాచార కమిషన్‌) - లోకాయుక్తలు ప్రధానంగా ఉన్నాయి. ఉమ్మడి సంస్థల్లో రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014లో 10వ షెడ్యూల్‌ కు సంభందించి కొన్ని సంస్థల సమస్యలు జటిల మయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే రాజ్యాంగ బద్దమైన సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఇరురాష్ట్రాలకు అనుమతులు మంజూరు చేసింది. ప్రధానంగా ఆస్తులు - అప్పులు లేని సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది. అందులో లోకాయుక్త - మానవ హక్కుల కమిషన్‌ - సమాచార హక్కు చట్టం మరికొన్ని సంస్థలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవన్నీ భౌగోలికంగా తెలంగాణాలో ఉండడం చేత తెలంగాణాకు చెందుతాయి. ఇప్పటికే 10వ షెడ్యూల్‌ లోని కొన్ని రాజ్యాంగ బద్దమైన సంస్థలు ఇరు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిలో రాష్ట్ర ఎన్నికల సంఘం - రాష్ట్ర మహళా కమిషన్‌ ఉన్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌ పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలన్నీ తెలంగాణ రాష్ట్ర సంస్థలుగా రూపాంతరం చెందనున్నాయి. ప్రస్తుతం అమరావతి కేంద్రంగా సచివాలయం - శాసనసభ - శాసన మండలి - హెచ్‌ వోడిలు - కమిషనరేట్లు పనిచేస్తున్నాయి. రాజ్యాంగ బద్ధమైన సంస్థలు రాజధానికి కేంద్రంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సంస్థల చట్టాల ప్రకారం రాజధాని కేంద్రంగా కార్యకాలపాలు కొనసాగించాల్సి ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ - మానవ హక్కుల కమిషన్‌ - లోకాయుక్త - సమాచార హక్కు చట్టం మరియు ఇతర సంస్థలు ఉన్నాయి.

ఏపిపియస్‌ సి లాంటి సంస్థలు పూర్తిస్థాయి కమిషన్‌ లుగా ఏర్పాటయినప్పటికీ హైదరాబాద్‌ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగించడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. రాష్ట్ర విభజన జరిగి 3 సంవత్సరాలు కావస్తున్న నేటికి విభజనకు నోచుకోకపోవడంతో సంబంధిత సంస్థలకు సంబధించిన కార్యకలాపాల కోసం వ్యయ ప్రయాసాల కోర్చి హైదరాబాద్‌ రావల్సి వస్తుంది. నిత్యం ప్రజలకు అనుసంధానంగా ఉండి సత్వరమే న్యాయం కోసం ఆశ్రయించే మానవ హక్కుల కమిషన్‌ విభజనకు నోచుకోకుండా హైదరాబాద్‌ లో ఉండడంతో బాధితులు అక్కడికి రావాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజా స‌మావేశంలో గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ప‌రిష్కారం దొరుకుతుంద‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/