Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ ను ఇబ్బంది పెట్టేసిన మోడీ

By:  Tupaki Desk   |   14 Sep 2016 7:12 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌ ను ఇబ్బంది పెట్టేసిన మోడీ
X
ఏపీ - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్‌ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలుసుకొని దాదాపు గంటకు పైగా చర్చలు జరిపిన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభజన సమస్యలతో పాటు తెలుగు రాష్ట్రాలలోని కరవు - వరదల పరిస్థితిపై నెలకొని ఉన్న తాజా పరిస్థితులపై ఆయన ప్రధానికి ఒక నివేదికను సమర్పించినట్లు తెలియవచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని 9 - 10వ షెడ్యూలు సంస్థల విభజన - ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై కొత్తగా తలెత్తిన వివాదంతో పాటు కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త సేద్యపునీటి ప్రాజెక్టులపై అపెక్స్‌ కౌన్సిల్‌ ను సమావేశపరచాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా స్థానంలో కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక సహాయం కూడా వీరి చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించంపై రాష్ట్ర ప్రజల మనోగతమేమిటో ప్రధాని మోడీ గవర్నర్ నరసింహన్‌ ను అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎన్‌ డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటంపై రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల గురించి ప్రధాని ఆయనను అడిగినట్లు తెలిసింది. ప్రత్యేక ప్యాకేజీపై జనం ఏమనుకుంటున్నారు? ప్యాకేజీలో పేర్కొన్న అంశాలు వారికి ఎంతవరకూ అర్థమయ్యాయి? ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌ కు కలిగే లాభాల గురించి తెలుగుదేశం - బీజేపీ నాయకులు ఎంతవరకూ ప్రజలకు వివరించగలుగుతున్నారు? వంటి విషయాలను మోడీ గ‌వ‌ర్నర్ వ‌ద్ద‌ వాకబు చేశారని అంటున్నారు. ప్రత్యేక హోదా మూలంగా ఏపీకి కలిగే లాభాలేమిటి? ప్రత్యేక సహాయం వలన హోదా కంటే ఎంత ఎక్కువ సాయం - ప్రయోజనం రాష్ట్రానికి అందుతోందనేది ప్రజలకు వివరించగలిగారా? అని ప్రధాని గవర్నర్‌ ను అడిగినట్లు తెలిసింది. దీనికి స‌మాధానం ఇచ్చేందుకు ఒకింత గ‌వ‌ర్న‌ర్ నరసింహన్ ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ... వాస్త‌వ ప‌రిస్థితులు వివ‌రించ‌మ‌ని ప్ర‌ధాని కోర‌డంతో క్షేత్ర‌స్థాయిలోని అంశాల‌ను తెలియ‌జేసినట్లు స‌మాచారం. అంతేకాకుండా తన నివేదికలో ప్రజలు వ్యక్తం చేస్తున్న భిన్నాభిప్రాయాల గురించి వివరించడంతోపాటు అందుకు గల కారణాలను కూడా విశ్లేషించారని అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏపీకి కలిగే ప్రయోజనాల గురించి మరింత సమర్థంగా వివరిస్తే బాగుంటుందని నరసింహన్ సూచించారనే మాట వినిపిస్తోంది. నరసింహన్ ప్రధాన మంత్రితో దాదాపు గంటసేపు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం గవర్నర్ పిఎంఓకు వెళ్లి సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు.

ఇదిలాఉండ‌గా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు - కేంద్ర సైన్స్ - విజ్ఞాన శాఖ మంత్రి సుజనా చౌదరి - రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ భవన్‌ లో గవర్నర్ నరసింహన్‌ తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు ప్రత్యేక ప్యాకేజీపై కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది. నరసింహన్ ప్రధాన మంత్రిని కలవడానికి ముందుగా సుజన - గంటా ఆయనతో చర్చించడం గమనార్హం.