Begin typing your search above and press return to search.

గవర్నర్ ఎప్పటిలానే మాటలు చెప్పి వెళ్లిపోయారు

By:  Tupaki Desk   |   12 May 2016 9:58 AM GMT
గవర్నర్ ఎప్పటిలానే మాటలు చెప్పి వెళ్లిపోయారు
X
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. వారికి విధేయుడిగా ఉంటూ.. వారి మనసును దోచుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగుతున్న వైనం తెలిసిందే. ఏ ముహుర్తంలో గవర్నర్ గా నరసింహన్ హైదరాబాద్ లో వచ్చారో కానీ.. అప్పటి నుంచి ఎన్నో రాజకీయ పరిణామాలు మారినా.. ఆయన స్థానం చెక్కు చెదరలేదు సరికదా మరింత శక్తివంతుడయ్యారని చెప్పాలి.

కేంద్రలో యూపీఏ సర్కారు పవర్ లో ఉన్నప్పుడు గవర్నర్ గా నియమితుడైన నరసింహన్.. మోడీ సర్కారులోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరి.. ఢిల్లీకి వచ్చి తాను ఇవ్వాల్సిన ఫీడ్ బ్యాక్ ను ప్రధానికి అందించి తన దారిన తాను వెళ్లటం నరసింహన్ కు మామూలే. కాకుంటే.. గతంలో ప్రధాని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిస్తే.. ఇప్పుడు మోడీతో సరిపెడుతున్నారు. కొన్ని సందర్బాల్లో మాత్రం రాజ్ నాథ్ తో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఢిల్లీకి వచ్చిన ఆయన.. మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట వరకూ ప్రధానితో చర్చలు జరిపిన గవర్నర్ నరసింహన్.. బయటకు వచ్చి మాత్రం నాలుగు ముక్కల్లో విషయాన్ని తేల్చేసి తన దారిన తాను వెళ్లిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఫిరాయింపులు.. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అధికారపక్ష వైఖరి.. తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ గురించి మోడీకి విలువైన సమాచారం అందించినట్లుగా చెబుతున్నప్పటికీ.. గవర్నర్ మాత్రం.. ప్రధానితో తాను సాధారణ విషయాలు మాత్రమే మాట్లాడినట్లుగా చెప్పుకొచ్చారు.

కరవు పరిస్థితుల్ని ప్రస్తావించానని చెప్పిన ఆయన ఏపీ.. తెలంగాణలోని రాజకీయాల మీద తాను ఏమీ మాట్లాడనంటూ తన దారిన తాను వెళ్లిపోయారు. ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో ఫుల్ క్లారిటీ ఉన్న గవర్నర్ నోటి నుంచి మాట బయబకు రాకుండా ఉండటం మామూలే కదా..?