Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ గారు ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   2 July 2016 12:24 PM GMT
గ‌వ‌ర్న‌ర్ గారు ఏం చేస్తున్నారు?
X
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌ గా ఉన్న నరసింహన్ - రెండు రాష్ట్రాల మధ్య గత రెండేళ్ల నుంచి కొనసాగుతున్న కీలక అంశాలను పరిష్కరించడంలో ఆసక్తి ప్రదర్శించడం లేదన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వ్య‌క్తిగ‌త ఆస‌క్తుల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న తగాదాలను పరిష్కరించడం కోసం, సగం కూడా ఇవ్వలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. నీళ్లు - నిధులు మొద‌లుకొని తాజాగా హైకోర్టు విభ‌జ‌న విష‌యంలోనూ ఇదే తీరు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య గతంలో జరిగిన నీటి సమరం - చివరకు రెండు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. నాగార్జునసాగర్ వేదికగా - రెండు రాష్ట్రాల పోలీసులు నేరుగా లాఠీలతో యుద్ధం చేసుకునే ప్రమాదం తలెత్తింది. అప్పుడు బాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఫోన్ చేసి - కూర్చుని మాట్లాడుకుందామని చెప్పారు. తర్వాత గవర్నర్ సమక్షంలో తొలిసారి ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. అంటే అప్పుడు కూడా గవర్నర్ తన పాత్ర సమర్థవంతంగా నిర్వహించలేకపోయారని, తమ వాదనకు మద్దతుగా ప‌లువురు గుర్తు చేస్తున్నారు. కృష్ణా నదీ జలాలపై చెలరేగిన పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల భారీ నీటిపారులదల శాఖ మంత్రులను కేంద్రమంత్రి ఉమాభారతి పిలిపించి - మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. రెండు రాష్ట్రాల గవర్నర్‌గా విస్తృతాధికారాలు ఉన్న నరసింహన్ మాత్రం, ఆ పాటి చొరవ తీసుకోలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీకి చెందిన న్యాయాధికారులు తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, వారిని సొంత రాష్ట్రానికి పంపాలన్న డిమాండుతో గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ కేంద్రంగా వివాదం సాగుతోంది. అధికారులు హైకోర్టు లోపలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ వ్యవహారం చివరకు ఢిల్లీకి చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జంతర్‌మంతర్‌లో దీక్ష చేస్తారనే వరకూ వెళ్లింది. ఏపీకి చెందిన న్యాయాధికారులకు రక్షణ లేకుండా పోయిందని, వరంగల్‌లో ఏపికి చెందిన న్యాయాధికారిపై లాయర్లు దాడి చేసిన వైనం సంచలనం సృష్టిస్తే, కనీసం అప్పుడు కూడా గవర్నర్ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గవర్నర్ తన విస్తృతాధికారాలను వినియోగించి, ఇద్దరు ముఖ్యమంత్రులనూ పిలిపించి, తగు హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం మేధావి - రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శాంతిభధ్రతల అంశం గవర్నర్ చేతిలోనే ఉన్నప్పటికీ, చివరకు హైకోర్టు - జిల్లా కోర్టుల వద్ద న్యాయాధికారులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపిలో పనిచేస్తున్న తెలంగాణ న్యాయాధికారుల విషయంలో కూడా, అక్కడి లాయర్లు ఇదే విధానం పాటిస్తే తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్రం విడిపోకముందు నుంచీ గవర్నర్‌ గా కొనసాగుతూ, విభజనలో కీలకపాత్ర పోషించి, ఎక్కడ ఎలాంటి సమస్యలొస్తాయో అవగాహన ఉన్న గవర్నర్, ఇప్పుడు సంక్షోభ సమయంలో శరవేగంగా స్పందించలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, గవర్నర్‌ ను కేంద్రం కావాలనే ప్రోత్సహిస్తోందన్న అసంతృప్తి తెదేపా వ‌ర్గాల్లో కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ - మంత్రి కేటీఆర్ తరచూ తనను కలుస్తున్న సందర్భంలోనయినా, నచ్చచెప్పాల్సిన గవర్నర్ ఆ పని చేయడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికయినా గవర్నర్ రెండు రాష్ట్రాల సీఎంలను పిలిపించి, కీలక సమస్యలపై దిశానిర్దేశం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.