Begin typing your search above and press return to search.

ఏపీకి అనుకూలంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడ‌రా?

By:  Tupaki Desk   |   2 Jun 2019 4:49 AM GMT
ఏపీకి అనుకూలంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడ‌రా?
X
రాజ్ భ‌వ‌న్ లో ఇఫ్తార్ విందు జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. పెద్ద‌న్న పాత్ర‌ను అదిరేలా నిర్వ‌హించిన గ‌వ‌ర్న‌ర్.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్ ఉండాలో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఒక్క‌సారి కూర్చొని సెటిల్ చేసుకునే అంశాలు సైతం గ‌డిచిన ఐదేళ్ల‌లో జ‌ర‌గ‌లేద‌న్న నిష్ఠూరం ఆడేశారు.

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూర్చొని విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు.పాల‌న‌లో సోద‌ర రాష్ట్రాలు రెండూ దేశంలోనే ఆద‌ర్శంగా నిల‌వాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేసిన గ‌వ‌ర్న‌ర్.. రెండు తెలుగు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అందించుకుంటూ ముందుకు న‌డ‌వాల‌న్న కోరిక‌ను వ్య‌క్తం చేశారు.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఏదైనా ఇచ్చేయాల్సిన విష‌యాన్ని ఏపీకి చెప్పే గ‌వ‌ర్న‌ర్ తాజాగా మ‌రోసారి త‌న తీరును ప్ర‌ద‌ర్శించార‌న్న విమ‌ర్శ ఉంది. రాష్ట్ర పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని షెడ్యూల్ 9-10లోని సంస్థ‌ల విభ‌జ‌న‌తో పాటు.. ఆస్తులు.. అప్పులు.. ఉద్యోగుల విభ‌జ‌న చేప‌ట్టాల‌న్న ఆయ‌న‌.. విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న‌పై సుప్రీంలో కేసు న‌డుస్తోంద‌ని.. రెండు తెలుగు రాష్ట్రాల ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఉద్యోగుల్ని విభ‌జించుకోవాల‌న్నారు.

అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ లో ఏపీకి అవ‌స‌రం లేని భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు ఇచ్చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ సూచ‌న చేశారు. స‌చివాల‌యంలో భ‌వ‌నాలు ఖాళీగా ఉన్నందున తెలంగాణ ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌న్నారు. నిజ‌మే.. వాడ‌కుండా ఉన్న భ‌వ‌నాల్ని తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇచ్చేయాల‌ని తేల్చేసిన గ‌వ‌ర్న‌ర్ దొర‌వారు.. ఏపీకి రావాల్సిన విద్యుత్ బ‌కాయిల విష‌యం మీద మాట వ‌ర‌స‌కు ఎందుకు మాట్లాడ‌రు.

కేసీఆర్ సాబ్‌.. ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన రూ.5వేల కోట్లు ఇచ్చేయండి.. ఉభ‌యులు క‌లిసిక‌ట్టుగా ఉండండి.. తెలుగు రాష్ట్రాల ఐక్య‌త ప్ర‌ద‌ర్శించండంటూ ఎందుకు మాట్లాడ‌లేదు. వివాదం ఏదైనా ఉంటే.. ఇద్ద‌రు ప‌రిష్క‌రించుకోవాల‌న్న మాటను చెప్పే గ‌వ‌ర్న‌ర్.. న్యాయంగా ఏపీకి రావాల్సిన వాటి గురించి మాట వ‌ర‌స‌కు మాట్లాడ‌రు కానీ.. ఏపీ ఏమేం ఇవ్వాల‌న్న విష‌యాల్ని మాత్రం గ‌వ‌ర్న‌ర్ చెప్ప‌టం చూస్తే.. ఏపీ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ తీరు స‌రిగా లేద‌న్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది.