Begin typing your search above and press return to search.

గవర్నర్ డోన్ట్ కేర్!

By:  Tupaki Desk   |   11 Jan 2018 4:08 AM GMT
గవర్నర్ డోన్ట్ కేర్!
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని.. గతంలో దానిని ఆర్డినెన్సు రూపంలో హడావిడిగా ఆమోదించేసి.. గవర్నరు సంతకం కోసం పంపింది. బిల్లు చూస్తే చాలా సందేహాలు ఉన్నాయి.. సంతకం పెట్టబోయేది లేదు.. ముందు ఆ సందేహాలన్నీ తీర్చండి అని ఆయన దానిని తిప్పి పంపారు. బాబు సర్కారు పంతానికి పోయింది.. అదే బిల్లును శాసనసభలో ఆమోదించి మళ్లీ గవర్నరు సంతకం కోసం పంపింది. ఆయన మాత్రం సంతకం చేయకుండా.. అట్టే పెట్టుకున్నారు. ఈలోగా భారతీయ జనతా పార్టీ నాయకులు రెచ్చిపోయి.. సభ ఆమోదించిన బిల్లుల మీద సంతకాలు పెట్టకుండా గవర్నర్.. ఏపీ ప్రగతిని అడ్డుకుంటున్నారంటూ.. ఎడాపెడా బురద చల్లడం ప్రారంభించారు. ఆయన తాజాగా మళ్టీ ఆ బిల్లును తిప్పి పంపారు. ఎవరు ఎన్ని విమర్శలతో తనను తప్పుపట్ట చూసినా సరే.. తాను అనుకున్నది చేస్తానే తప్ప... విమర్శలను ఖాతరు చేయబోయేది లేదని తన డోన్ట్ కేర్ వైఖరిని గవర్నర్ చాలా స్పష్టంగా నిరూపించుకున్నారు.

అవును.. ఇదంతా ఏపీ ప్రభుత్వంతో గవర్నరు నరసింహన్ కు తాజాగా ఏర్పడి ఉన్న ప్రతిష్టంభన. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి సంబంధించిన కొత్త బిల్లును ప్రభుత్వం రూపొందించి గవర్నరు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే.. వ్యవసాయ భూములను - కమర్షియల్ భూములుగా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే తక్షణం కన్వర్షన్ చేసేసి అనుమతులు ఇచ్చేయడానికి వీలవుతుంది. అయితే ఆర్డినెన్స్ సమయంలోనే.. ఇందులో లోపాలు ఉన్నాయంటూ.. గవర్నర్ ఆ బిల్లును తిప్పిపంపారు. సభ ఆమోదం పొందిన తర్వాత మళ్లీ సంతకానికి పంపారు. శాసనసభ కూడా ఆమోదించాక సాధారణంగా గవర్నరు తిరస్కరించడం జరగదు. కానీ నరసింహన్ దానికి మళ్లీ మోకాలడ్డారు.

ఏపీ లో ఏయే నాయకులకు ఇందులో ఎలాంటి స్వప్రయజనాలు దాగి ఉన్నాయో తెలియదు గానీ.. వారంతా నరసింహన్ మీద విరుచుకుపడడం కూడా ప్రారంభం అయింది. అయినా సరే ఆయన పట్టించుకోలేదు సరికదా.. బిల్లును రెండోసారి తిప్పిపంపారు. పాత అనుమానాలనే తీర్చలేదే అంటూ.. మొత్తం సందేహాలు నివృత్తి చేయాల్సిందేనని పట్టుపట్టారు చూడబోతే ఆయన బిల్లులో లోపాలు కనిపిస్తే ఎవ్వరినీ ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరించే వైఖరితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి వక్ర ప్రయోజనాలను మానుకుని.. ఆయన సూచించిన లోపాలను దిద్దుకుంటే తప్ప.. బాబు ప్రభుత్వం ఈ గండం దాటేలా లేదు.