Begin typing your search above and press return to search.

ఆయన చేతిలో రాజ్యాంగం.. విభజన చట్టం పుస్తకాలు!

By:  Tupaki Desk   |   27 Jun 2015 5:30 AM GMT
ఆయన చేతిలో రాజ్యాంగం.. విభజన చట్టం పుస్తకాలు!
X
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ భేటీ సందర్భంగా ఆసక్తికరమైన అంశం ఒకటి విపరీతంగా ఆకర్షించింది. ఓటుకు నోటు వ్యవహారం.. ఆపై ట్యాపింగ్‌.. తాజాగా సెక్షన్‌ 8 అమలు.. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించి వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గవర్నర్‌తో పాటు హోం శాఖకు చెందిన కీలక అధికారులు భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం పొక్కనప్పటికీ.. ఈ భేటీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గవర్నర్‌ నరసింహన్‌ ఈ భేటీని చాలా సాదాసీదాగా తేల్చేసినప్పటికీ.. ఆయన మాటలు చెప్పినంత సాదాగా ఏమీ సమావేశాలు జరగలేదని తెలుస్తోంది.

రోటీన్‌ మీటింగ్‌లో అయితే.. పలుమార్లు హోంశాఖ కీలక అధికారులతో గవర్నర్‌ భేటీ కావాల్సిన అవసరం ఏమిటి? ఇదొక్కటే కాదు.. హోం శాఖ సంయుక్త కార్యదర్వి అలోక్‌ కుమార్‌ చేతిలో భారత రాజ్యాంగం.. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రతి ఉండటం చూసినప్పుడు.. విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీలకు సంబంధించి చట్టంలో పేర్కొన్న అంశాలపై లోతుగా పరిశీలించినట్లు అర్థం అవుతుంది. లేకుండా.. సంయుక్త కార్యదర్శి చేతిలో ఈ రెండు పుస్తకాలతో భేటీకి వెళ్లాల్సిన అవసరం లేదు.

రెండు రాష్ఠ్రాల మద్య పలు వివాదాలకు సంబంధించి నోటి మాట కంటే కూడా.. చట్టంలో ఏం పేర్కొన్నారు..? అలా పేర్కొన్న అంశాలపై రాజ్యాంగంలోని పలు అంశాలు వర్తించవంటూ తెలంగాణ అధికారపక్షం నేతలు వాదనలు చేస్తున్న నేపథ్యంలో.. ఈ పుస్తకాలు పట్టుకొని మరీ భేటీ కావటం ఆసక్తికరమే. చూస్తుంటే.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించి కేంద్రం ఒక కచ్ఛితమైన అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.