Begin typing your search above and press return to search.

మొదటిసారి; చేతల్లో చూపించిన గవర్నర్‌

By:  Tupaki Desk   |   5 July 2015 4:49 AM GMT
మొదటిసారి; చేతల్లో చూపించిన గవర్నర్‌
X
విభజన పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొత్తకాదు. ప్రతి విషయానికి ఏదో ఒక పంచాయితీతో రెండు రాష్ట్ర అధికారులు.. హైకోర్టుకు లేదంటే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌ అయిన నరసింహన్‌ వద్దకు వెళ్లటం తెలిసిందే.

గత పదమూడు నెలలుగా పలు అంశాలు తన దృష్టికి వచ్చినప్పటికీ కర్ర విరగకుండా.. పాము చావని చందంగా.. రెండు పక్షాలు సర్దుకు పోవాలన్నట్లుగా తీర్పులు చెప్పి పంపటం తెలిసిందే. ఇలాంటి తీర్పులపై తెలంగాణ సర్కారు కన్నా ఏపీ సర్కారే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరగటం లేదని ఆరోపించింది.

ఇలాంటి వైఖరికి భిన్నంగా ఈసారి.. గవర్నర్‌ విస్పష్ట నిర్ణయం తీసుకోవటంతో పాటు.. రాతపూర్వకంగా సమాచారాన్ని ప్రభుత్వానికి పంపటం గమనార్హం. విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్‌లోని అంశాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తెలుగు విశ్వవిద్యాలయం.. అంబేడ్కర్‌ యూనివర్సిటీ తమవేనని.. వాటి సేవలు కావాలంటే.. ముందుగా ఒప్పందం చేసుకోవాలంటూ తెలంగాణ సర్కారు పేర్కొనటం తెలిసిందే.

దీనికి సంబంధించి రగిలిన వివాదాన్ని ఏపీ సర్కారు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లటం.. ఆయన ఉదంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. తెలుగు విశ్వవిద్యాలయం.. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలకు సంబంధించి యథాతథస్థితిని అమలు చేయాలని.. తర్వాత నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం వరకూ.. ఇప్పటివరకూ కొనసాగిన తీరునే కంటిన్యూ చేయాలన్న మాటను లిఖితపూర్వకంగా లేఖను ప్రత్యేక దూత చేత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపారు.

ఇంతకాలం ఇలాంటి చర్యలు తీసుకోని గవర్నర్‌.. తొలిసారి ఒక అంశంపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారన్న వాదన వినిపిస్తోంది. మరి.. దీనిపై తెలంగాణ సర్కారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.