Begin typing your search above and press return to search.

బాబును గవర్నర్ పొగిడేశారండోయ్

By:  Tupaki Desk   |   7 July 2016 8:19 AM GMT
బాబును గవర్నర్ పొగిడేశారండోయ్
X
సంప్రదాయానికి భిన్నంగా రాజ్ భవన్ వదిలేసి.. ఏపీ ముఖ్యమంత్రితో చర్చల కోసం ఏపీ రాజధానికి వచ్చేసిన గవర్నర్ నరసింహన్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్నపనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాసేపు మీడియాతో మాట్లాడిన ఆయన బాబును ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా మాత్రమే ఉన్నానని చెప్పిన నరసింహన్.. చంద్రబాబు మాత్రం ప్లేయింగ్ కెప్టెన్ గా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.

కొత్త ఇళ్లు కట్టుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయని.. సమస్యల్ని అర్థం చేసుకొని ఉద్యోగులు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఉద్యోగులు పని చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారన్న నరసింహన్.. నూతన రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్ని ప్రశంసించారు.

ఇక.. బుధవారం రాత్రి విందు సందర్భంగా జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగినట్లుగా వ్యాఖ్యానించిన గవర్నర్.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలకు సంబంధించి.. వాటి పరిష్కారం కోసం చంద్రబాబు కొన్ని పరిష్కారాలు సూచించారన్నారు. రానున్న రోజుల్లో ఈ చర్చలు మరింత ఫలప్రదం కానున్నట్లు చెప్పిన గవర్నర్..రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు తొలిగిపోయతాయని పేర్కొనటం గమనార్హం.

బాబును పొగిడేసిన గవర్నర్ పనిలో పనిగా మీడియాపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. గవర్నర్ తెలంగాణకే పరిమితం అయ్యారన్న విమర్శలపై ఆయన ఒకింత ఘాటుగానే స్పందించారని చెప్పాలి. ‘‘నేను తెలంగాణకే పరిమితం అయ్యానని విమర్శలు చేయటం తగదు. ఆంధ్రప్రదేశ్ లోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. రెండు రాష్ట్రాలు వృద్ధి చెందాలన్న అజెండాతోనే ఈ పర్యటన చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.