Begin typing your search above and press return to search.

గవర్నరుకు ఏపీలోనూ భజన శాఖే..!

By:  Tupaki Desk   |   25 Jan 2018 4:16 AM GMT
గవర్నరుకు ఏపీలోనూ భజన శాఖే..!
X
తెలుగు రాష్ఱ్టాల గవర్నరు నరసింహన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్ ను అక్కడి ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తుండడం.. అది వివాదాస్పదం కావడం తెలిసిందే. కేసీఆర్‌ను నెత్తికెత్తుకుంటున్న గవర్నరుకు భజన శాఖ కేటాయించాలని కాంగ్రెస్ నేతలు విమర్శించిన సంగతీ తెలిసిందే. మరోవైపు గవర్నరు తీరుపై ఏపీ నేతలూ మండిపడుతున్నారు. పైకి ఏమీ అనకపోయినా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ గవర్నరుపై మండిపడుతోంది. ఇదంతా చూసిన గవర్నరు పరిస్థితులను బ్యాలన్సు చేయాలనుకున్నారో ఏమో కానీ, తాజాగా చంద్రబాబును కూడా ఒక రేంజిలో పొగిడేశారు. ఈ క్రమంలో ఆయన ఇంతవరకు ఎవరూ అనని రీతిలో ‘చంద్రబాబు 24x7 కాదని 25×8’ అని చెప్పారు. దీంతో... ఆయనకు భజన శాఖ కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊరికే అనలేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం గ్రామాన్ని గవర్నరు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చెప్పబోతున్నానని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్న చంద్రబాబు - 24×7 కాకుండా 25×8( గంటలు×రోజులు) పనిచేస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. సౌభాగ్యరాయపురం గ్రామమైనప్పటికీ పట్టణ ప్రాంతానికి ధీటుగా అన్ని వసతులతో బాగుందని, ఇక్కడి ప్రజలు సంతోషంగా - ఆనందంగా ఉండటం తాను గమనించానని గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ‘సౌభాగ్యరాయపురం’లోని ‘రాయ’ పదాన్ని తొలగించి ‘సౌభాగ్యపురం’గా ఆ గ్రామం పేరు మార్చాలని జిల్లా కలెక్టర్ కు ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. కాగా, పెందుర్తి మండలం సంపూర్ణ ఓడీఎఫ్ ను సాధించిన నేపథ్యంలో ఆ గ్రామానికి ప్రభుత్వం తరపున ఒక లక్ష రూపాయలను ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. గవర్నరు తాజా భజనను చూసినవారంతా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడి నేతలను పొగడుతున్నారని అంటున్నారు.