Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్ల‌పై కేసీఆర్‌ కు గ‌వ‌ర్న‌ర్ షాకిచ్చారా?

By:  Tupaki Desk   |   13 April 2017 6:35 AM GMT
రిజ‌ర్వేష‌న్ల‌పై కేసీఆర్‌ కు గ‌వ‌ర్న‌ర్ షాకిచ్చారా?
X
ముస్లిం మైనారిటీల‌కు వారి జ‌నాభా ధామాషా ప్ర‌కారం 12 శాతం రిజ‌ర్వేష‌న్లిస్తామ‌ని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ ఎన్నిక‌ల నాడు ఘ‌నంగానే చెప్పేశారు. ఆ త‌ర్వాత అధికార ప‌గ్గాలు చేపట్టిన కేసీఆర్‌... మూడేళ్లు గ‌డుస్తున్నా కూడా వాటి దిశ‌గా ఒక్క అడుగు కూడా వేయ‌లేక‌పోయార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఎందుకంటే... ఇచ్చిన మాట ప్ర‌కారం ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లిస్తే... తెలంగాణ‌లో మొత్తం రిజ‌ర్వేష‌న్ల శాతం 50 శాతానికంటే పెరిగిపోవ‌తుంది. ఇది రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంకోర్టు తీర్పును ధిక్క‌రించ‌డ‌మే అవుతుంది. అయితే త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రాలు 50 శాతానికి కూడా మించి రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్న వైనాన్ని ప‌రిశీలించిన కేసీఆర్‌... ఎట్ట‌కేల‌కు మూడేళ్ల త‌ర్వాతైనా ఈ విష‌యంలో ముందుకెళ్లాల‌నే తీర్మానించుకున్నారు. ఈ మేర‌కు నిన్న నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌పై వెన‌క్కెళ్లే స‌మ‌స్యే లేద‌ని కూడా తెగేసి చెప్పారు.

ఈ సంద‌ర్భంగా త‌మ య‌త్నానికి కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించాల్సి ఉంద‌ని, ఏ కార‌ణం చేత‌నైనా దీనికి కేంద్రం విముఖత వ్య‌క్తం చేస్తే స‌హించేది లేద‌ని కూడా ఆయ‌న ఓ స్థాయిలో కీల‌క వ్యాఖ్య చేశారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తాము చ‌ట్టం చేసి పంపుతామ‌ని, దానికి కేంద్రం మోకాలొడ్డితే మాత్రం యుద్ధ‌మేన‌ని కూడా ప్ర‌క‌టించారు. అంటే... ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశంపై కేంద్రంతో పోరాటానికి కూడా వెనుకాడేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పిన‌ట్లైంది. అయినా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధ‌మ్యాల‌ను ఇక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించే వెసులుబాటు ఉన్నా కూడా కేసీఆర్ కేంద్రం మాట‌ను వినిపించ‌డం వెనుక పెద్ద క‌థే న‌డిచింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఆ వాద‌న వివ‌రాల్లోకెళితే... ముస్లింల‌కు 12 శాతం మేర రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే... దానికి గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ ఆమోద ముద్ర వేస్తే స‌రిపోతుంది. ఆ త‌ర్వాత ఎవ‌రైనా అభ్యంత‌రం తెలిపితే.. కోర్టుకెళితే అప్పుడు న్యాయ‌స్థానాల్లోనే కేసీఆర్ స‌ర్కారు ఢీకొంటుంది. అయితే మ‌రి ఇక్క‌డ కేసీఆర్ కేంద్రం మాట‌ను ఎందుకు వినిపించాల్సి వ‌చ్చిందంటే... ఈ తీర్మానంపై ఆమోద ముద్ర వేసేందుకు గ‌వ‌ర్న‌ర్ స‌సేమిరా అన్నార‌ట‌. ప్ర‌తి చిన్న విష‌యాన్ని నేరుగా రాజ్ భ‌వ‌న్‌ కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ చెవిన వేసిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకునే కేసీఆర్‌... రిజ‌ర్వేష‌న్ల విష‌యంలోనూ గ‌వ‌ర్న‌ర్‌ తో ప‌లుమార్లు భేటీ అయ్యార‌ట‌. అయితే సుప్రీంకోర్టు తీర్పులు - రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిపై ముందుగానే ప‌క్కా స‌మాచారం ఉన్న గ‌వ‌ర్న‌ర్‌... కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌కు స‌సేమిరా అన్నార‌ట‌.

ఈ విష‌యంలో తానేమీ నిర్ణ‌యం తీసుకోలేన‌ని, ఒక‌వేళ ప్ర‌భుత్వం తీర్మానాన్ని త‌న‌కు పంపినా... దానిని నేరుగా కేంద్రానికే రిఫ‌ర్ చేస్తాన‌ని గ‌వ‌ర్న‌ర్‌ చెప్పార‌ట‌. ఇందులో తాను అశ‌క్తుడిన‌ని, రాజ్యాంగంతో ముడివ‌డి ఉన్న ఈ విష‌యంలో తాను ఇబ్బందుల పాలు కాలేన‌ని కూడా గ‌వ‌ర్న‌ర్‌... కేసీఆర్ ముఖం మీదే చెప్పార‌ట‌. ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా ముందుగా మీకు చెప్పిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటున్నా కూడా... ఇలా మాట్లాడ‌తారేంట‌ని కేసీఆర్ ప్ర‌శ్నిస్తే... తమ్ముడు త‌మ్ముడే - పేకాట పేకాటే అన్న చందంగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించార‌ట‌. దీంతో కాస్తంత అయోమ‌యానికి గురైన కేసీఆర్‌... ఆ తేల్చుకునేదేదో కేంద్రంతోనే తేల్చుకునేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆరు నెల‌ల క్రిత‌మే రిజ‌ర్వేష‌న్ల‌పై తీర్మానం చేద్దామ‌ని కేసీఆర్ అనుకున్నా కూడా... గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రితో పూర్తి స్థాయి అధ్య‌య‌నం చేయాల‌ని భావించిన కేసీఆర్‌... ఇప్పుడు దానిని పూర్తి చేసి కార్య‌రంగంలోకి దిగుతున్న‌ట్లు స‌మాచారం.

గ‌తంలో స‌మ‌గ్ర స‌ర్వేకు సంబంధించి కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న చందంగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌... తాజాగా రిజ‌ర్వేష‌న్ల విష‌యంలోనూ అదే వైఖ‌రితో ముందుకు వెళ్లేందుకే నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. సాధార‌ణంగా ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు విముఖ‌త‌తో ఉన్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని బీజేపీకి చెందిన తెలంగాణ నేత‌లు ఇప్ప‌టికే బ‌హిరంగంగానే ప్ర‌క‌టించేశారు. ఈ క్ర‌మంలో రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తాము పంపే ప్ర‌తిపాద‌న‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌కుండా మోకాలొడ్డితే ఎలాగ‌న్న కోణంలో ఆలోచించిన మీద‌టే... నిన్న కేసీఆర్ కేంద్రానికి హెచ్చరిక‌లు జారీ చేసిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. చూద్దాం... ఈ పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/