Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన గ‌వ‌ర్న‌ర్‌

By:  Tupaki Desk   |   15 Aug 2017 7:36 AM GMT
ప‌వ‌న్‌ ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన  గ‌వ‌ర్న‌ర్‌
X
జ‌నసేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు భార‌త‌దేశ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అనూహ్య‌ ఆహ్వానం ద‌క్కింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్‌ నుంచి పవన్ కళ్యాణ్‌ కు ప్ర‌త్యేక‌ ఆహ్వానం అందింది. స్వాతంత్ర్య‌ దినోత్సవం సందర్భంగా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు గ‌వ‌ర్న‌ర్ నివాస‌మైన రాజ్ భవన్‌ లో తేనీటి విందు ఇవ్వ‌డం సంప్రదాయం. ఈ సంప్ర‌దాయంలో భాగంగా స‌హ‌జంగా ప్ర‌ముఖ రాజ‌కీయ‌ పార్టీల నేత‌ల‌ను గవర్నర్ ఆహ్వానిస్తారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌ కు ఆహ్వానం ద‌క్కింది.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్ భవ‌న్‌ లో `ఎట్ హోం` పేరుతో నిర్వ‌హించే ఈ కార్యాక్ర‌మానికి హాజ‌రుకావాల‌న్న గవర్నర్ ఆహ్వానం మేరకు ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ రాజ్‌ భ‌వ‌న్‌ ను వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు జ‌నసేన పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది. కాగా, జ‌న‌సేన పార్టీని స్థాపించిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ నివాస‌మైన రాజ్‌ భవ‌న్‌ కు ప‌వ‌న్ వెళ్ల‌డం ఇది మొద‌టిసారి.

కాగా, సంపదలు అట్టడుగు వర్గాలకు చేరినప్పుడే స్వాతంత్య్రానికి సరైన అర్థం - పరమార్థం చేకూరుతుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ''మన దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు. కానీ జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు'' అని పేర్కొన్నారు. అమరుల త్యాగాల వల్లే మనమంతా ఏడు దశాబ్దాలుగా స్వేచ్ఛను ఆస్వాదించగలుగుతున్నామన్నారు. అయితే దేశంలో ఆర్థిక - సామాజిక అసమానతలు ఇంకా ఉన్నాయన్నారు. సామాజిక అసమానతలు సమసిపోయే రోజు కోసం భరత జాతి అంతా కలిసికట్టుగా కృష్టి చేయాలన్నారు. ''71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛా భారతికి నీరజనాలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు, జనసేన కార్యకర్తలకు, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు.