Begin typing your search above and press return to search.

తెలుగు చంద్రుళ్లలో లేనిది..తమిళ నరసింహన్ లో ఉన్నదదే

By:  Tupaki Desk   |   8 April 2016 4:32 AM GMT
తెలుగు చంద్రుళ్లలో లేనిది..తమిళ నరసింహన్ లో ఉన్నదదే
X
తెలుగోళ్లకు తమ గురించి తమకు అస్సలు పట్టదు కానీ.. ప్రపంచంలోని అందరివి పడతాయంటూ విమర్శలు వినిపిస్తుంటాయి. ఆ విషయంలో ముఖ్యమంత్రులు మొదలు సామాన్యుల వరకూ అందరిలోనూ అలాంటి పరిస్థితే ఉందన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. తెలుగు వారి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గవర్నర్ నరసింహన్ నివాసగృహమైన రాజ్ భవన్ లో ఉగాది వేడుకల్ని నిర్వహించిన సందర్భంగా ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది.

ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మాజీ కేంద్రమంత్రి చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తెలుగువారి పండుగకు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు ఇద్దరూ ఎప్పటి మాదిరి రెగ్యులర్ వస్త్రాలతో ఈ కార్యక్రమానికి హాజరైతే.. గవర్నర్ నరసింహన్ మాత్రం తెలుగు సంప్రదాయమైన పంచెకట్టుతో హాజరయ్యారు. తమిళుడైన గవర్నర్ నరసింహన్ తెలుగు పంచెకట్టులో రావటానికి ఎలాంటి ఇబ్బంది పడకుంటే.. తెలుగువారికి ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రులిద్దరూ ఫ్యాంటు.. షర్ట్ లకే పరిమితమయ్యారు.

తెలుగు సంప్రదాయం.. ఆచారవ్యవహారాలు.. సంస్కృతి గురించి వీరావేశంలో కబుర్లు చెప్పే వారు.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. యాగాలు.. పూజల సమయంలో పంచెలు కట్టుకునే అధినేతలు.. తెలుగోళ్ల పండగ సమయాల్లో అదే తీరుతో వ్యవహరించటం ద్వారా తెలుగు సంప్రదయాల్ని గుర్తు చేసినట్లు అయ్యేది. కానీ.. అలాంటి పని చేయని వారు.. అచ్చ తెలుగు పంచెకట్టులో కార్యక్రమానికి హాజరైన గవర్నర్ ను చంద్రబాబు ప్రశంసించటం గమనార్హం. గవర్నర్ తెలుగుదనంపై సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు తాను అలా రాకుండా ఉండలేకపోయానన్న బాధను మాత్రం వ్యక్తం చేయలేదు. సంస్కృతి.. సంప్రదాయాల గురించి తరచూ మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. తెలుగు పండక్కి ఫ్యాంటు చొక్కా వేసుకురావటమేమిటో..?

మామూలుగా అయితే ఇలాంటి విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. కానీ.. తెలుగోళ్ల పండుగ సందర్భంగా ఒక తమిళుడు తెలుగు సంప్రదాయం ప్రకారం వస్త్రాల్ని ధరిస్తే.. తెలుగు చంద్రుళ్లు ఇద్దరు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం చూసినప్పుడు తెలుగువారికున్న తెగులేమిటో ఇట్టే అర్థమవుతుంది. మన సంప్రదాయం గురించి మనకు పట్టకపోవటానికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది? తెలుగు లోగిళ్లలో ఉండే తమిళుడికి తెలుగు సంప్రదాయం మీదున్న ప్రేమ.. తెలుగువారైన ముఖ్యమంత్రులకు పట్టకపోవటం ఏమిటి?