Begin typing your search above and press return to search.

సీన్ రివర్స్; బాబు దగ్గరికే వెళుతున్న గవర్నర్

By:  Tupaki Desk   |   6 July 2016 10:18 AM GMT
సీన్ రివర్స్; బాబు దగ్గరికే వెళుతున్న గవర్నర్
X
రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళుతున్నారు. సాధారణంగా ఏదైనా అంశానికి సంబంధించి చర్చించాల్సి వస్తే.. తన వద్దకు ముఖ్యమంత్రిని పిలిపించుకుంటారు. కానీ.. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇందుకు భిన్నంగా తానే నడుం బిగించి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు వీలుగా గవర్నర్ తన తాజా టూర్ ను సిద్దం చేసుకోవటం గమనార్హం.

హైకోర్టు విభజన మీద తెలంగాణ రాష్ట్ర సర్కారు పోరాటం చేస్తుండటం.. ఈ వ్యవహారంలో ఏపీ తోడ్పాటు లేకుండా ఇష్యూను ఒక కొలిక్కి తీసుకురావటం కష్టమైన నేపథ్యంలో.. ఈ సమస్యకు పరిష్కారం వెతికేందుకు వీలుగా తానే స్వయంగా రంగంలోకి దిగాలని నరసింహన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే.. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరీ ఆయన రాజ్ భవన్ ను విడిచి.. ఏపీ రాజధానికి పయనమవుతున్నారు.

సాధారణంగా ఏదైనా ఇష్యూ మీద ముఖ్యమంత్రితో గవర్నర్ మాట్లాడాలనుకుంటే రాజ్ భవన్ కు రావాలని ఆహ్వానిస్తారు. గవర్నర్ కు తగిన సమయం చూసుకొని సీఎం వెళతారు. కానీ.. తాజా ఇష్యూలో సీన్ రివర్స్ అయ్యింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ఉంటారన్న విషయాన్ని తెలుసుకొని.. ఆయన షెడ్యూల్ కు తగ్గట్లుగా తన ప్రయాణాన్ని గవర్నర్ సిద్ధం చేసుకోవటం కనిపిస్తుంది. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్న బాబు.. సాయంత్రానికి బెజవాడకు చేరుకోనున్నారు. అందుకే.. బుధవారం సాయంత్రం నుంచి తన ప్రయాణాన్ని పెట్టుకున్న గవర్నర్.. విజయవాడకు వెళ్లి కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని.. ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు హాజరవుతారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్యన భేటీ ఉండనుంది. హైకోర్టు విభజన అంశం ఈ సందర్భంగా చర్చకు వస్తుందని చెబుతున్నారు. హైకోర్టు విభజన.. జడ్జిల ప్రాధమిక కేటాయింపులపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ తెలంగాణ జడ్జిలు.. లాయర్లు సమ్మె చేయటం.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్.. గవర్నర్ నరసింహన్ లు ఈ ఇష్యూను తాము చూస్తామని చెప్పటం తెలిసిందే. వీరి మాటలతో సమ్మెను విరమించుకున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భాగంగానే నరసింహన్ తాజా పర్యటనగా చెబుతున్నారు. సంప్రదాయాలను పక్కన పెట్టి మరీ.. ముఖ్యమంత్రి దగ్గరకు వెళుతున్న గవర్నర్.. తాను అనుకున్నది సాధిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారిందని చెప్పాలి.