Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ నేడు ఆస్ప‌త్రికి..రేపు డిల్లీకి...

By:  Tupaki Desk   |   8 Jan 2018 9:58 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌ నేడు ఆస్ప‌త్రికి..రేపు డిల్లీకి...
X
తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చారు. హ‌ఠాత్తుగా ఆస్ప‌త్రికి - అనూహ్యంగా ఢిల్లీకి బ‌య‌లుదేర‌డం ఈ చ‌ర్చకు కార‌ణ‌మైంది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఈరోజు మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్లారు. రేపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో పాటుగా హోంమంత్రిని ఆయ‌న క‌లువ‌నున్నారు. కాగా, ఈ ప‌ర్య‌ట‌న వెనుక రాజకీయ‌ప‌ర‌మైన అంశాలు కూడా ఉండి ఉంటాయ‌ని అంటున్నారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌కు ముందు గ‌వర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.

ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ సైతం గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ ప‌నితీరుపై బీజేపీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ కేంద్రంలోని త‌మ పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత జి.కిష‌న్ రెడ్డి సైతం ఇదే అంశాన్ని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ పై తాము ఇప్ప‌టికే ఫిర్యాదు చేశామ‌ని...మ‌ళ్లీ చేస్తామ‌ని కూడా ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో తాజా టూర్ వెనుక కార‌ణం బీజేపీ నేత‌ల ఫిర్యాదులేనా అని ప‌లువురు అంటున్నారు. ఇదిలాఉండ‌గా...కాంగ్రెస్ నేత‌లు సైతం గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ ఎస్ పార్టీకి వంత‌పాడేలా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వారు ఆక్షేపించారు. మాజీ కేంద్ర మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ అయితే...`కొత్త గ‌వ‌ర్న‌ర్‌ ను నియ‌మించేందుకు బీజేపీలో గ‌వ‌ర్న‌ర్ అర్హ‌త గ‌ల నేత‌లు ఎవ‌రూ లేరా ` అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా...సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గవర్నర్ నరసింహన్ మరోసారి సోమ‌వారం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్‌ కు గాంధీ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఐసీయూలో రోగులకు అందుతున్న సౌకర్యాలపై వైద్యుల వద్ద గవర్నర్ ఆరా తీశారు. 2017, ఆగస్టు నెలలో కుడికాలుకు ఉన్న ఆనె సమస్యకు గవర్నర్ సర్జరీ చేయించుకున్న విషయం విదితమే.

కాగా, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన‌మంత్రితో పాటుగా రాష్ట్రప‌తితో స‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది. గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశాని హాజ‌రు అయ్యేందుకు ఆయ‌న ఢిల్లీ వెళుతున్నార‌ని స‌మాచారం.ఇటీవ‌ల నియ‌మించిన ఓ క‌మిటీ తాలుకూ నివేదిక‌ను రాష్ట్రప‌తికి అందించ‌నున్న‌ట్లు చెప్తున్నారు.