Begin typing your search above and press return to search.

మాజీ పోలీస్ బాస్ పై ఆగస్టులో వేటు

By:  Tupaki Desk   |   21 July 2015 10:01 AM GMT
మాజీ పోలీస్ బాస్ పై ఆగస్టులో వేటు
X
రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న మాజీ ఐబీ చీఫ్ నరసింహన్ పై వేటు పడుతుందన్న ప్రచారం ఎంతో కాలంగా నడుస్తున్నదే. ఓటుకు నోటు వ్యవహారం.. ఆ తర్వాత వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఏపీ సర్కారు గవర్నర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆ సమయంలో కొందరు గవర్నర్ ను మారుస్తారంటూ ఊహాగానాలు చేసినప్పటికీ.. అప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ ను మారిస్తే లేనిపోని తలనొప్పులు అన్న ఉద్దేశ్యంతో ఊరుకోవటం తెలిసిందే. తాజాగా.. ఒక అంగ్ల దినపత్రికలో గవర్నర్ మార్పుపై భారీ కథనాన్ని ప్రచురించటంతో నరసింహన్ పై వేటు పడుతుందా అన్న చర్చ మరోసారి మొదలైంది.

ఆ మధ్య రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేంద్రహోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ గవర్నర్ మార్పుపై మాట్లాడినట్లుగా సదరు వార్తలో పేర్కొన్నారు. అయితే.. ఈ వార్తలో పేర్కొన్న అంశాలు అంత సంతృప్తికరంగా.. వాదనకు అనువుగా లేకపోవటం గమనార్హం.

ఇప్పటికిప్పుడు గవర్నర్ ను మార్చే అవకాశం లేదని.. ఆగస్టులో ఆయనపై వేటు పడే వీలుందని సదరు కథనం పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంటున్న వివాదాల పరిష్కారంలో గవర్నర్ కీలక పాత్ర పోషించలేదన్న అసంతృప్తి కేంద్రానికి ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ కథనంలోని అంశాల్నికాసేపు పక్కన పెడితే.. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీలు ఎంత క్లిష్టమైనవో కేంద్రానికి తెలియంది కాదు. స్వయంగా కేంద్రమంత్రుల వద్దకు రెండు రాష్ట్రాల వివాదాలు వెళ్లినప్పుడు వారెంత ఉక్కిరిబిక్కిరి అనుభవించారో తెలియంది కాదు. ఈ నేపథ్యంలో పరిమిత పాత్ర పోషించే గవర్నర్ అపరిమితమైన అధికారాల్ని చెలాయించాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది.

ఇక.. గవర్నర్ మార్పునకు ఉన్న అంశాల్ని పరిశీలిస్తే.. గవర్నర్ పై మిత్రపక్షమైన టీడీపీ గుర్రుగా ఉండటం.. రెండు రాష్ట్రాల బీజేపీ నేతల్ని గవర్నర్ పెద్దగా పట్టించుకోవటం లేదన్న వాదనతో పాటు.. తెలంగాణ అధికారపక్షానికి ముకుతాడు వేసేలా వ్యవహరించేందుకు నరసింహన్ కంటే కూడా.. సీనియర్ బీజేపీ నేతకు గవర్నర్ గా ఏర్పాటు చేస్తే మంచిదన్న ఆలోచనలో కేంద్రానికి ఉందన్న వ్యాఖ్య వినిపిస్తోంది.