Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు గవర్నర్ వార్నింగ్

By:  Tupaki Desk   |   2 March 2017 5:57 AM GMT
చంద్రబాబుకు గవర్నర్ వార్నింగ్
X
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్ గట్టి షాకే ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి కేబినెట్లో చోటివ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ ఆటలు సాగబోవంటూ.. ఒకవేళ అలా వారికి మంత్రి పదవులిస్తే తాను వారితో ప్రమాణ స్వీకారం చేయించబోనంటూ వార్నింగ్ ఇచ్చారని ఓ ప్రముఖ పత్రిక సంచలన కథనం ప్రచురించింది.

గతంలో తెలంగాణలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినప్పుడు గవర్నర్ నరసింహన్‌ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగానికి గవర్నరే తూట్లు పొడుస్తున్నారని చంద్రబాబు నేరుగా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఏపీ మంత్రులు కూడా గవర్నరును ఆడుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేయడానికి సిద్ధమవుతుండడంతో గవర్నరు తన అధికారాలను ఉపయోగించి చంద్రబాబును ఇరుకునపెట్టడానికి రెడీ అవుతున్నారట.

ఈ మేరకు ఆయన చంద్రబాబు కేబినెట్లోని ఒక సీనియర్ మంత్రి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారట. ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, వాటికి ఆమోదం లభించిన తర్వాతే వారికి మంత్రి పదవులివ్వాలని.. కాదుకూడదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిస్తే వారితో ప్రమాణ స్వీకారం చేయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా తన మాటగా చంద్రబాబుకు చెప్పమని కూడా ఆయన అన్నట్లు సమాచారం. నిజానికి తెలంగాణలో తలసాని విషయంలో టెక్నికల్ గా ఇక్కడే చిన్నచిన్న పొరపాట్లు దొర్లడంతో గవర్నరు అప్పట్లో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తలసాని మంత్రి పదవి తీసుకోవడానికి ముందే రాజీనామా చేశారు. కానీ.. స్పీకర్ దాన్ని ఆమోదించకుండా తొక్కిపట్టారు. ఆ అంశాన్ని టీడీపీ పదేపదే లేవనెత్తడమే కాకుండా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. గవర్నరును దోషిగా చూపిస్తూ విమర్శలూ చేసింది. దీంతో ఇప్పుడు అదే తప్పు మీరెలా చేస్తారంటూ గవర్నరు ప్రశ్నించారట.

అయితే.. గవర్నరు వర్తమానం పంపిన ఆ మంత్రి ఎవరన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. యనమల రామకృష్ణుడు - చినరాజప్పల్లో ఒకరితో గవర్నరు ఇదంతా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. మంత్రి ఎవరైనా ముఖ్యమంత్రికి గవర్నరు గట్టి వార్నింగ్ ఇవ్వడం మాత్రం నిజమని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/