Begin typing your search above and press return to search.

మళ్లీ నోరు జారిన కోషియారీ.. ఈసారి పూలే దంపతులపై వాచాలత

By:  Tupaki Desk   |   3 March 2022 10:30 AM GMT
మళ్లీ నోరు జారిన కోషియారీ.. ఈసారి పూలే దంపతులపై వాచాలత
X
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి నోటి దురుసు ఎక్కువే అన్నట్లుంది. తన వాచాలతతో వరుసగా వివాదాల్లో కూరుకుపోతున్నారాయన. మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి, అదికూడా బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రంలో శివసేన వంటి మాజీ మిత్రపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రంలో గవర్నర్ గా వ్యవహరిస్తున్న కోషియారీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

ఎందుకంటే.. తూర్పున బెంగాల్ లో టీఎంసీ కార్యకర్తలు ఎంతటి దూకుడు గలవారో పశ్చిమాన మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు అంతకుమించి దుందుడుకు వారు. అయితే, కోషియారీ రాజ్యంగబద్ధ పదవిలో ఉంటూ తరచూ నోరు జారుతుండడం అనేక విమర్శలకు తావిస్తోంది.

కొంతకాలం క్రితం ఛత్రపతి శివాజీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇప్పుడు కోట్లాది మంది ఆదర్శంగా భావించే జ్యోతిబాపూలే దంపతుల విషయంలో నోరుజారారు. అదికూడా అగ్ర వర్ణ పార్టీ అనే ముద్ర ఉన్న బీజేపీ కి ఒకప్పుడు జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కోషియారీ.. వంద కోట్ల మంది వెనుకబడిన, అణగారిన వర్గాల వారు పూజ్యనీయంగా భావించే పూలే దంపతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీకి చాలా పెద్ద దెబ్బ.

మరో వివాదంలో మహారాష్ట్ర గవర్నర్ సామాజిక చైతన్య కార్యక్రమాలతో గాంధీజీ కంటే ముందే సమాజాన్ని మేల్కొలిపారు జ్యోతిబా పూలే. ఆయన భార్య సావిత్రీ బాయి పూలే అయితే 120 ఏళ్ల కిందటే వెనుకబడిన కులాల మహిళలు చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాంటివారిపై ఫూలే దంపతులు చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఓ కార్యక్రమంలో కోషియారీ మాట్లాడుతూ, పదేళ్ళ వయసున్న సావిత్రి బాయ్‌ని 13 ఏళ్ల వయసులో జ్యోతిబా పెళ్లి చేసుకున్నారని, ఆ చిన్నతనంలో వారు ఏం చేయగలరని, పెళ్లి జరుగుతున్నపుడు వారు ఏం ఆలోచించగలరని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఆయనను తక్షణమే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో బాల్యంలోనే పెళ్లి చేసుకోవడం ఆచారమని, ఇటువంటి అసహ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి ఫూలేను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. కోషియారీ కొద్ది రోజుల క్రితం ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.

శివాజీ మహరాజ్‌కు సమర్థ రామదాసు గురువు అని చెప్పారు. ఈ గడ్డపైన అనేక మంది మహారాజులు, చక్రవర్తులు జన్మించారన్నారు. చాణక్యుడు లేకపోతే చంద్రగుప్త మౌర్య గురించి ఎవరు అడుగుతారన్నారు. సమర్థ రామదాసు లేకపోతే ఛత్రపతి శివాజీ గురించి ఎవరు అడుగుతారన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి.

కాగా, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న కోషియారీ ఉత్తరాఖండ్ కు చెందినవారు. ఆ రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 79 ఏళ్ల కోషియారీ 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.