Begin typing your search above and press return to search.

ఎల్విరా నబియులీన.. పుతిన్ ఆర్థిక బలం ఆమెనే!

By:  Tupaki Desk   |   13 May 2022 3:01 AM GMT
ఎల్విరా నబియులీన.. పుతిన్ ఆర్థిక బలం ఆమెనే!
X
ఉక్రెయిన్ తో రష్యా యుద్ధాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. దీన్ని భారత్ ఎలా చూస్తుందన్న విషయంపై ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహా అయితే వారం అంతే.. అనుకున్న యుద్ధం కాస్తా వారాల తరబడి సాగుతోంది. రష్యా వేసుకున్న అంచనాలకు మించిన నడుస్తున్న యుద్దం ఒక ఎత్తు అయితే.. పశ్చిమ దేశాలన్ని కలిసి కట్టుగా చేస్తున్న ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం రష్యాకు అంత ఈజీ కాదు. ఈ విషయంలో రష్యా అధినేత వాద్లిమిర్ పుతిన్ కు అండగా నిలిచి.. పక్కా వ్యూహాల్ని రచిస్తూ తన సత్తాను చాటటమే కాదు.. రష్యా బలంగా నిలబడేలా చేస్తున్నది ఒక మహిళ అంటే నమ్ముతారా? ఆమెనే.. ఎల్విరా నబియులీన. అవును.. రష్యా దేశాధ్యక్షుడి ఆలోచనల్ని పక్కాగా అమలు చేయటంలో సక్సెస్ అవుతుందీమె. ఇంతకూ ఆమె ఏం చేస్తారంటారా? రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎల్విరా నబియులీన.

1986లో మాస్కో స్టేట్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె పన్నెండేళ్ల పాటు యూఎస్ఎస్ఆర్ (రష్యా ముక్కలు కాకముందే) సైన్స్ అండ్ ఇండస్ట్రీ యూనియన్ లో పని చేశారు. పలు పదవుల్ని చేపట్టిన ఆమె పుతిన్ దేశాధ్యక్షుడి బాధ్యతను చేపట్టిన తర్వాత ఆమెను ది మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ అండ్ ట్రేడ్ లో ఫస్ట్ మినిస్టర్ గా నియమించారు. పుతిన్ కోర్ టీంలో ఒకరైన ఆమె 2012లో పుతిన్ మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత క్రెమ్లిన్ లో ఆమెను కీలకమైన సలహాదారు టీంలోకితీసుకున్నారు. 2013లో ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యాకు గవర్నర్ గా నియమించారు. అప్పటి నుంచి ఆమె ఆ పదవిలో కంటిన్యూ అవుతున్నారు. తాజాగా ఈ ఏడాది మార్చిలో మూడోసారి ఆమె పదవీ కాలాన్ని పొడిగించారు.

2013 నుంచి 2017 వరకు రష్యా బ్యాంకింగ్ వ్యవస్థను తీర్చి దిద్దేందుకు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కఠిన చర్యలు తీసుకున్న ఆమె.. రష్యాలో బలహీనంగా ఉన్న 300లకు పైగా బ్యాంకుల లైసెన్సుల్ని రద్దు చేయటంతో పాటు మనీ లాండరింగ్ కు అవకాశం లేకుండా చేశారన్న పేరుంది. అంతేకాదు.. రూబుల్ (రష్యా కరెన్సీ పేరు) ను ప్రభుత్వ జోక్యంతో విలువను నిర్దేశించటం కాకుండా.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడ్ అయ్యేలా చేశారు. ద్రవ్యోల్బణ కట్టడి పైనా ఆమె ఫోకస్ చేశారు. వడ్డీరేట్లను 17 శాతానికి పెంచేందుకు సైతం వెనుకాడలేదు. 2014లో రష్యాకు భారీ సవాలు విసిరిన పరిస్థితుల్ని డీల్ చేయటంలో ఆమె తన సత్తాను చాటారు.

ఆ ఏడాది అమెరికాతో పాటు సౌదీ చమురు ఉత్పత్తిని భారీగా పెంచేయటంతోక్రూడ్ ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో చమురు ఎగుమతుల ద్వారా బండి నడిపించే రష్యాకు ఇదో పెద్ద సవాలుగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలకు కారణమైంది. చాలా రష్యా కంపెనీలను అమెరికా మార్కెట్ నుంచి బయటకు పంపారు. దీంతో ఆ కంపెనీలకున్న భారీ విదేశీ అప్పులు ప్రమాద ఘంటికలను మోగించింది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ నుంచి వీలైనంతగా డాలర్లను వదిలించుకోవటానికి చర్యలు చేపట్టారు.

రష్యా బ్యాంకులకు ఉన్న 600 బిలియన్ డాలర్ల రిజర్వులను బంగారం.. యూరో.. చైనా రెన్మిన్ బీ వైపు మళ్లించటంతోరష్యా రిజర్వులో డాలర్లు 40 శాతం నుంచి 11 శాతానికి పడిపోయాయి. ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధం వేళ రష్యా మీద పెట్టిన ఆంక్షలతో బ్యాంకుల విదేశీ రిజర్వులను స్తంభింపచేసినా.. తగినంత బంగారం.. రెన్మిన్ బీ కరెన్సీ అందుబాటులో ఉండటం రష్యాను నిలదొక్కునేలా చేసింది. మన దేశంలో మాదిరే రష్యాలోనూ డెబిట్.. క్రెడిట్ కార్డుల పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు అమెరికాకు చెందిన కంపెనీలే కీలకం కావటం.. అవన్నీ పని చేయకుండా చేయటంతో రష్యా ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

దీంతో వడ్డీ రేట్లను తగ్గించటం.. దేశీయ కంపెనీలు దిగుమతి చేసుకనే వస్తువల కంటే.. దేశీయంగా తయారు చేసే వస్తువుల్ని వాడేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు.. రష్యా చేసే ఎగుమతులకు బదులుగా ఇవ్వాల్సిన అమెరికా డాలర్ స్థానే రష్యా రూబుల్ ఇవ్వాలని తేల్చటం ద్వారా.. రష్యా రూబుల్ కు డిమాండ్ తేవటంలో సక్సెస్ అయ్యారు. 2021లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఉమెన్ లో ఎల్విరా స్థానం 60. రష్యాకు ఆర్థిక సవాళ్లు ఎదురైన ప్రతిసారీ తానున్నానన్న భరోసాను ఇవ్వటమే కాదు.. పుతిన్ నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో ఆమె ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అదే.. రష్యా ఆర్థికంగా నిలబడేలా చేస్తోంది.