Begin typing your search above and press return to search.

చిన్నమ్మ ప్రమాణానికి అడ్డేమిటో చెప్పిన గవర్నర్?

By:  Tupaki Desk   |   11 Feb 2017 7:38 AM GMT
చిన్నమ్మ ప్రమాణానికి అడ్డేమిటో చెప్పిన గవర్నర్?
X
తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభానికి సంబంధించి.. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఎందుకు ఆలస్యమైందన్న విషయాన్ని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న చిన్నమ్మ.. ఆ కేసు తీర్పు వారంలో వస్తుందని సుప్రీం వెల్లడించిన నేపథ్యంలో.. తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నఆలోచనతోనే శశికళ ప్రమాణస్వీకారంపై నిర్ణయం తీసుకోవటంలో కాస్త ఆలస్యమైనట్లుగా చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం సభలో సభ్యురాలి కాని వారు ముఖ్యమంత్రి పదవిని చేపడితే.. ఆర్నెల్ల వ్యవధిలో చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న శశికళ కానీ దోషిగా తేలిన పక్షంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఉండదు. అందుకే.. సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉన్నట్లుగా చెబుతున్నారు.

మరోవైపు ఏ పన్నీరు సెల్వం అయితే తనకు తాను ప్రతిపాదించి శశికళను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక చేశారో.. ఇప్పుడాయన అందుకు భిన్నంగా తన చేత బలవంతంగా రాజీనామా చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పరిస్థితుల్ని అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితి గురించి ఆయన కేంద్రానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.