Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాకిచ్చిన గవర్నర్ తమిళిసై ట్వీట్

By:  Tupaki Desk   |   17 Sep 2021 10:30 AM GMT
కేసీఆర్ కు షాకిచ్చిన గవర్నర్ తమిళిసై ట్వీట్
X
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం. అయితే ఈరోజును తెలంగాణలో కొలువైన కేసీఆర్ సర్కార్ అధికారికంగా నిర్వహించడం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు దీన్ని నిర్వహిస్తామని వాగ్దానం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ నెరవేర్చడం లేదు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తరపున విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు..

విపక్షాలు గత ఏడు సంవత్సరాలుగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి కానీ స్పందన లేదు. ఈక్రమంలోనే ఈరోజు విమోచన దినం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపుతోంది. విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆమె ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

"సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యధిక త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను" అని తమిళిసై తెలుగులో ట్వీట్ చేశారు.

గవర్నర్ ట్వీట్ తో అధికార టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా కలత చెందింది. టీఆర్ఎస్ నాయకులు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించనప్పటికీ, వారు అంతర్గతంగా ఈ ట్వీట్ తో ఇరుకున పడ్డారని తెలుస్తోంది. విపక్షాలు బిజెపి-కాంగ్రెస్ లు గవర్నర్ ట్వీట్‌ను సద్వినియోగం చేసుకుంటున్నాయి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి.

అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు నిర్మల్‌లో అడుగుపెడుతున్నారు. తెలంగాణ బిజెపి నిర్వహిస్తున్న విమోచన దినోత్సవ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక్కడి నుంచే తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించనున్నారు. తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయన పిలుపునివ్వనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ మొదటి పౌరురాలు అయిన గవర్నర్ చేసిన ట్వీట్ ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ ను ఇరుకునపెట్టేలానే ఉంది.