Begin typing your search above and press return to search.

కరోనా టీకా తీసుకున్న తెలంగాణ గవర్నర్

By:  Tupaki Desk   |   2 April 2021 12:08 PM GMT
కరోనా టీకా తీసుకున్న తెలంగాణ గవర్నర్
X
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ఈ రోజు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై ఈరోజు పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. మహిళల కోసమే ప్రత్యేకంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ పుదుచ్చేరిలో ఏర్పాటైంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దీన్ని శుక్రవారం ప్రారంభించారు. పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో మహిళల కోసమే ఈ కేంద్రాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఒక మహిళగా, వైద్యురాలిగా, పుదుచ్చేరి ప్రథమ పౌరురాలిగా వ్యాక్సిన్ తీసుకోవడం గర్వంగా ఉందని, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తున్నా పౌరులు కూడా తగిన సహకారం ఇవ్వాలని ఆమె కోరారు.భారతదేశంలోనే తయారైన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను తీసుకున్నానని, పరిశోధన మొదలు అభివృద్ధి, తయారీ, పంపిణీ వరకు మొత్తం మన దేశంలోనే జరగడం మొత్తం ప్రపంచానికే ఆదర్శమన్నారు. కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా నివారణ కోసం జాగ్రత్తలు పాటించాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకుంటూనే వైరస్ వ్యాప్తి నివారణ కోసం బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.