Begin typing your search above and press return to search.

కేసీఆర్‌తో ప‌నిచేయ‌డం.. చాలా క‌ష్టం.. గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   19 April 2022 3:30 PM GMT
కేసీఆర్‌తో ప‌నిచేయ‌డం.. చాలా క‌ష్టం.. గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన‌ప్ప‌టికీ.. త‌ర్వాత కాలంలో ముఖ్య‌మంత్రులు నియంతలుగా మారుతున్నారని సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. తాను ప్ర‌స్తుతం పుదుచ్చేరి, తెలంగాణ‌ల్లో గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నార‌ని.. ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నాన‌ని చెప్పారు.

అయితే.. ఇద్దరు ముఖ్య‌మంత్రులు కూడా చాలా విష‌యాల్లో భిన్నమైనవారని గవర్నర్ త‌మిళిసై అన్నారు. ఇది ప్రజాస్వాయ్యనికి మంచింది కాదని ఓ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ వ్యాఖ్యానించారు. రాజకీ యాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారని, ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారని తమిళిసై అన్నారు. తనను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది వాస్తవం కాదని తమిళిసై స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

సీఎం, గవర్నర్‌ కలిసి పనిచేయకపోతే ఎలా పాలన ఉంటుందో తెలంగాణను చూస్తే తెలుస్తుందని మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య విసిరారు గ‌వ‌ర్న‌ర్‌. ముఖ్యమంత్రి కేసీఆర్తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా... ఆ పరిస్థితిని తాను కోరవటంలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు... అధికార పార్టీకి విరుద్ధమైన నిర్ణయాలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను... వ్యక్తిగతంగా కించపర్చే విధంగా ప్రవర్తించటం సరికాదన్నారు.

ప్రజలకు సేవ చేసేందుకు గానూ అందరం కలిసి సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం చేసే అన్ని సిఫార్సులను గవర్నర్‌ ఆమోదించాలని లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిధికి లోబడి గవర్నర్‌ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఏదైనా విభేదించగానే ప్రభుత్వం వివాదం చేయటం సరికాదని... అన్నింటినీ వ్యక్తిగత వ్యవహారాలకు ఆపాదించవద్దని గవర్నర్ చెప్పారు. ప్రోటోకాల్‌ పాటించకపోవడం సరికాదని పునరుద్ఘాటించారు. పరస్పర చర్చలు, అవగాహనతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.

తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ విందును బహిష్కరించాయని.. గవర్నర్‌ను ఒక పార్టీకి చెందిన వారిగా చూడటం సరికాదని అన్నారు. ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని... ఒకరు తమ అభిప్రాయం చెప్పగానే విమర్శించడం సరికాదని తమిళిసై తెలిపారు.